
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ కు స్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్ ‘సిందూర్’ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాల సరిహద్దులు, దేశంలోని ఎయిర్ పోర్టుల్లో భద్రతపై ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సరిహద్దుల వెంట ఎలాంటి పరిస్థితుల్లో నెలకొన్నాయో అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను పెంచడంపై తీసుకున్న చర్యల గురించి అధికారులకు ఆయన వివరించారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్స్ ఈ భేటీలో పాల్గొన్నారు. కాగా.. జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంట చొరబాటు యత్నాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకొని ఏడుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకే అమిత్ షా సమీక్ష నిర్వహించారు.