మార్చి 12న తెలంగాణకి అమిత్ షా

మార్చి 12న తెలంగాణకి అమిత్ షా
  • ఎల్బీ స్టేడియంలో బూత్​ కమిటీ అధ్యక్షులతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 12న రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి అమిత్​ షా రానున్నారు. బీజేపీ పోలింగ్​ బూత్​ ఏజెంట్లతో ఆయన సమావేశం కానున్నారు. హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.  ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలింగ్​ బూత్​ కమిటీల అధ్యక్షులతో సమావేశం కానున్న అమిత్​షా.. పార్లమెంట్​ఎన్నికల సన్నద్ధతపై వివరించనున్నారు. 

ఆ సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గతంలోనే రావాల్సి ఉన్నా..అమిత్​ షా రాష్ట్ర పర్యటన ఇప్పటికే​ రెండుసార్లు రద్దయింది. వాస్తవానికి జనవరి 28న పాలమూరు, కరీంనగర్, హైదరాబాద్​ పర్యటనకు ఆయన రావాల్సి ఉన్నది. అప్పుడు బీహార్​లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  పర్యటన రద్దు చేసుకున్నారు.  ఈ నెల 2న కూడా అమిత్​ షా సోషల్​ మీడియా వారియర్లతో సమావేశమవ్వాల్సి ఉండగా,  ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ పర్యటన కూడా రద్దయింది. తాజాగా 12న అమిత్​ షా షెడ్యూల్​ను ఖరారు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.