ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాని పదవి కోసం కొట్లాటే : అమిత్ షా

ఇండియా కూటమి గెలిస్తే.. ప్రధాని పదవి కోసం కొట్లాటే : అమిత్ షా

పాట్నా: లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ ఇండియా కూటమి గెలిస్తే అందులోని అగ్రనేతలు ప్రధాని పదవి కోసం కొట్లాడుకుంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ప్రధాని అయ్యేలా రాహుల్ గాంధీ, స్టాలిన్, శరద్ పవార్, లాలూ ప్రసాద్, మమతా బెనర్జీ వంటి అగ్రనేతలు ఒప్పందం కుదుర్చుకుంటారని హెచ్చరించారు. మోదీ మూడోసారి ప్రధాని అయితేనే దేశంలో అవినీతి అంతమవుతుందన్నారు. 

సోమవారం బిహార్‌‌లోని ఝంఝర్‌‌పూర్, బెగుసరాయ్ లోక్‌‌సభ నియోజకవర్గాల్లో అమిత్ షా ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." పొరపాటున ఇండియా కూటమి గెలిస్తే ప్రధాని సీటు కోసం కూటమిలోని అగ్రనేతల మధ్య కొట్లాట తప్పదు. స్టాలిన్, శరద్ పవార్, లాలూ, మమత ఒక్కొక్కరు ఒక్కో ఏడాది ప్రధాని సీట్లో కూర్చుంటారు. 

వాళ్ల తర్వాత మిగిలి ఉన్న పదవీకాలంతో రాహుల్ బాబా(రాహుల్ గాంధీ) సరిపెట్టుకోవాల్సిందే. అదే బీజేపీ గెలిస్తే మళ్లీ మోదీనే ప్రధాని అవుతారు. ఆయన ప్రధాని అయితేనే బిహార్‌‌తో సహా దేశంలో అవినీతి, కులతత్వ నిర్మూలన జరుగుతుంది" అని అమిత్ షా వివరించారు.