నిత్యావసరాలు, మెడిసిన్స్​ సరిపడా ఉన్నాయి

నిత్యావసరాలు, మెడిసిన్స్​ సరిపడా ఉన్నాయి
  • జనం ఆందోళన చెందాల్సిన పనిలేదు: అమిత్​షా

న్యూఢిల్లీ: లాక్​డౌన్​ను పొడిగించినా ఆహారం, మెడిసిన్స్ తో పాటు ఇతర నిత్యావసర వస్తువులు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర హోంమంత్రి అమిత్​షా భరోసా ఇచ్చారు. తమ ఇంటి దగ్గరలో ఉండే పేదలు, అనాధలకు సాధ్యమైనంత వరకూ సాయం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్​లో పలు ట్వీట్లు చేశారు. ‘‘దేశ హోం మంత్రిగా నేను జనానికి హామీ ఇస్తున్నాను. దేశంలో కావాల్సినంత ఆహారం, మందులు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. వాటి గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. మీ ఇంటి దగ్గరలో ఉన్న పేదులకు, అనాధలకు సహాయం చేయండి”అని అమిత్​షా చెప్పారు. లాక్​డౌన్​ సమయంలో కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇకపై ఈ సహకారాన్ని మరింత పెంచాలని, లాక్​డౌన్​ వల్ల ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనాపై పోరాటంలో ముందున్న పోలీసులు, డాక్టర్లు, మెడికల్​ సిబ్బంది, శానిటరీ వర్కర్ల గురించి ఎంత చెప్పినా తక్కేవేనని, వారి ధైర్యం, ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం వారి నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.