బస్టాండు దాకే ‘అమ్మఒడి’

బస్టాండు దాకే ‘అమ్మఒడి’
  • బస్టాండు దాకే ‘అమ్మఒడి’
  • ఇంటి వరకు దింపని 102 వెహికల్ 
  • సంగారెడ్డిలో బాలింతలు, గర్భిణులకు తప్పని తిప్పలు

సంగారెడ్డి, వెలుగు : సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు బాలింతలు, గర్భిణుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం సంగారెడ్డి జిల్లాలో  సరిగా అమలు కావడం లేదు. గర్భిణీ ఆరోగ్య పరిరక్షణ తోపాటు తల్లి, బిడ్డలను సురక్షితంగా 102 వెహికల్​లో ఇంటి వద్ద దింపాలన్నది పథకం ఉద్యేశం. కానీ వైద్య అధికారుల పర్యవేక్షణ లోపం, వాహన డ్రైవర్ల అలసత్వం కారణంగా  అమ్మఒడి పథకం నీరుగారి పోతోందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి పరిధిలో అమ్మఒడి పథకం అమలు కోసం  నాలుగు 102 వెహికల్స్ ఉన్నాయి. 

గర్భిణులు, బాలింతలను వాహనంలో తీసుకెళ్లి టౌన్ పరిధిలో ఉన్న కొత్త బస్టాండ్, పాత బస్టాండ్ వద్ద దింపేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అదే మార్గం గుండా మరికొందరు బాలింతలు, గర్భిణులను తీసుకెళ్లాల్సి ఉందని, అందుకు టైం పడుతుందంటూ  సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో బాలింతలు, వారి సహాయకులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ సౌకర్యం లేని గ్రామాలకు చెందినవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డీజిల్ డబ్బులు కలిసొస్తాయనో లేక పనిభారం తగ్గించుకోవడానికో తెలియదు కానీ సిబ్బంది నిర్వాకం వల్ల తాము చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు. 

బస్టాండ్ లో  దించిపోయిన్రు.. 

సంగారెడ్డి సర్కారు దవాఖానాలో డెలివరీ అయ్యాక 102 వాహనంలో కూర్చోబెట్టుకుని ఏ బస్టాండ్ కు వెళ్లాలని అడిగిన్రు.. బస్టాండ్ కు ఎందుకని,  పటాన్ చెరు మండలం లక్డారం గ్రామంలోని మా ఇంటికి వెళ్లాలని చెప్పిన. కానీ ఏవో సాకులు చెప్పి సంగారెడ్డి కొత్త బస్టాండ్ లో దించిపోయిన్రు.. అమ్మఒడి పథకం అమలైతలేదని అప్పుడు అర్థమైంది నాకు. ఇప్పటికైనా పెద్దసారోళ్లు పట్టించుకొని బాలింతలకు ఇబ్బంది లేకుండా చూడాలె. 
– రమణి బాలింత, లక్డారం గ్రామం, పటాన్​చెరు మండలం.