ఇస్కాన్ బ్యాన్ తర్వాత అమోఘ్ లీలా దాస్‌ క్షమాపణలు

ఇస్కాన్ బ్యాన్ తర్వాత అమోఘ్ లీలా దాస్‌ క్షమాపణలు

స్వామి వివేకానంద, రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమోఘ్ లీలా దాస్ ఎట్టలకేలకు క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఒక వీడియోను రిలీజ్ చేశారు. తాను ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేయలేదని, తన ఉద్దేశం కూడా అది కాదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే క్షమించమని కోరారు. ఆ వీడియోలో కృష్ణుడు భక్తులకు, ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సాధువు అమోఘ్ లీలా దాస్  అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. లీలా దాస్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విమర్శలకు తావివ్వడంతో ఆయనపై ఇస్కాన్ చర్యలు తీసుకుంది. ఒక నెల రోజుల పాటు లీలా దాస్‌ను సంస్థ నుంచి నిషేధిస్తు్న్నట్టు ప్రకటించింది. అమోగ్ లీలా దాస్ ఆధ్యాత్మిక ప్రవచనాలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంది.

ఎవ‌రీ అమోఘ్ లీలా దాస్‌...? 

ఇంట‌ర్నేష‌న‌ల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్సియ‌స్‌నెస్‌(ఇస్కాన్‌) జులై 11వ తేదీ మంగ‌ళ‌వారం రోజు ధ‌ర్మ ప్రచార‌కుడు అమోఘ్ లీలా దాస్‌ ను బ్యాన్ చేసింది. స్వామి వివేకానంద‌, రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న‌పై చ‌ర్యలు తీసుకుంది. ప్రస్తుతం లీలా దాస్ వ‌య‌సు 43 ఏళ్లు. ఆధ్మాత్మిక‌వేత్తగా.. లైఫ్‌స్టయిల్ కోచ్‌గా, మోటివేష‌న్ స్పీక‌ర్‌గా ఆయ‌న పాపుల‌ర్‌. గత 12 ఏళ్ల నుంచి అంటే జులై 11వ తేదీ వరకు లీలా దాస్ ఇస్కాన్‌లో ప‌ని చేశారు. ద్వార‌క‌లో ఉన్న ఇస్కాన్ ఆల‌యంలో వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. 

అమోఘ్ లీలా దాస్ అస‌లు పేరు ఆశిశ్ అరోరా. ల‌క్నోలోని పంజాబీ కుటుంబంలో జ‌న్మించారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో నివ‌సిస్తున్నారు. 2004లో ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. కొన్నాళ్లు అమెరికాకు చెందిన బ‌హుళ‌జాతి కంపెనీలో ప‌ని చేశారు. 2010లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వ‌దిలేశారు. 29 ఏళ్ల వ‌య‌సులో ఇస్కాన్‌లో చేరిన ఆయ‌న బ్రహ్మచారిగా కొనసాగుతూ వచ్చారు. 

సోష‌ల్ మీడియాలో లీలా దాస్‌కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మ‌తం గురించి ఆయ‌న పోస్టు చేసిన వీడియోలు ఆన్‌లైన్‌లో తెగ వైర‌ల్ అవుతుంటాయి. ఇటీవ‌ల ఓ వీడియోలో ఆయ‌న స్వామి వివేకానంద ఆహారపు అల‌వాట్లు, టీచ‌ర్ రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న‌పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప‌బ్లిక్ ఈవెంట్లలో పాల్గొనరాదు అంటూ ఇస్కాన్ లీలా దాస్ పై నిషేధం విధించింది. 

లీలా దాస్ ఏమన్నారంటే..?  

లీలాదాస్ ఇటీవల చేసిన ఒక ప్రవచనంలో స్వామి వివేకానంద గురించి ప్రస్తావన చేస్తూ.. ఆయన చేప తినడాన్ని ప్రశ్నించారు. సద్గుణ వంతులు ఎప్పుడైనా చేపను తింటారా..? చేపకు కూడా బాధ ఉంటుంది.. అవునా..? అప్పుడు సద్గుణవంతులు చేపను తింటారా? అని ప్రశ్నించారు. స్వా్మి వివేకానంద గురువైన రామకృష్ణ పరమహంసపై కూడా లీలాదాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంటనే లీలాదాస్ వ్యాఖ్యలపై ఇస్కాన్ విచారం వ్యక్తం చేసింది. 

స్వామి వివేకానందం, రామకృష్ణ పరమహంస బోధనలపై అవగాహన లేకుండా అమోఘ్ లీలాదాస్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని అప్పుడే ఒక ప్రకటనలో తెలిపింది. నెలరోజుల పాటు సంస్థ నుంచి ఆయనను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. లీలాదాస్ తన వ్యాఖ్యలకు క్షమాపణ అడగాలని, నెలరోజుల పాటు గోవర్ధన్ కొండల్లో ప్రాయశ్చిత్తం చేసుకుంటానని ప్రతిన చేయాలని పేర్కొంది. ప్రజాజీవితానికి దూరంగా ఆయన పూర్తిగా ఏకాంతంలోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ఆ ప్రకటన పేర్కొంది.