
బెంగళూరు: ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి జీవాంజి దీప్తి గోల్డ్ మెడల్‌తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 400 మీటర్ల (టీ11, 12, 13, 20 కేటగిరీ) ఈవెంట్‌లో పారాలింపిక్ మెడలిస్ట్ దీప్తి అందరికంటే వేగంగా 56.70 సెకండ్లతో పోడియం ఫినిష్ చేసి బంగారు పతకం అందుకుంది. గుజరాత్‌కు చెందిన దామోర్ తేజల్ అమర్జీ (58.70 సె) రజతం, హర్యానా అథ్లెట్ భువీ అగర్వాల్ (1:09.60 సె) కాంస్యం గెలుచుకున్నారు.
మరోవైపు పారాలింపిక్ చాంపియన్, జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ మెన్స్ ఎఫ్12, ఎఫ్ 64 ఈవెంట్‌లో 72.25 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మన్‌జీత్ రజతం, ప్రదీప్ కుమార్ కాంస్యం సాధించారు. మరో జావెలిన్ త్రో విభాగం (ఎఫ్40 , ఎఫ్41)లో పారిస్ పారాలింపిక్స్ చాంపియన్ నవదీప్ సింగ్ (42.63 మీ) కూడా స్వర్ణం గెలుచుకున్నాడు.
రాజస్తాన్‌కు చెందిన సుందర్ సింగ్ గుర్జర్ ఎఫ్46 విభాగంలో 64.53 మీటర్ల త్రోతో బంగారు పతకం సాధించాడు. విమెన్స్ టీ35, టీ37, టీ42 కేటగిరీ 100 మీటర్ల ఈవెంట్‌లో యూపీకి చెందిన ప్రీతి పాల్ 15 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం సాధించింది. టీ12 , టీ13 కేటగిరీ 100 మీటర్ల రన్‌లో యూపీకే చెందిన సిమ్రాన్ 12.30 సెకండ్లతో బంగారు పతకం సాధించింది.