సూపర్​ సైక్లోన్​ ‘ఉంపన్’..రేపు తీరం దాటే అవకాశం

సూపర్​ సైక్లోన్​ ‘ఉంపన్’..రేపు తీరం దాటే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడిన సైక్లోన్​ ఉంపన్ సోమవారం మధ్యాహ్నానికి పెను తుఫానుగా మారింది. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్​లోని పలు తీర ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను బంగాళాఖాతంలో దక్షిణంగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం(ఈ నెల 20) నాటికి బెంగాల్, బంగ్లాదేశ్​మధ్య  తీరం దాటే అవకాశం ఉందన్నారు. దిఘా, హాతియా ఐలాండ్​ ల మధ్య తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులకు తీరప్రాంతాల్లోని గుడిసెలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని, పక్కా ఇండ్లు కూడా దెబ్బతింటాయని చెప్పారు. కరెంట్​ స్తంభాలతో పాటు ఇతర కమ్యూనికేషన్​ పోల్స్ నేలకూలే అవకాశం ఉందని, పలుచోట్ల కరెంటు సరఫరా దెబ్బతింటుందని అన్నారు. రైల్వే ట్రాక్​లు పాక్షికంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పంటలు, ప్లాంటేషన్స్, పూల తోటలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. ఒడిశాలోని తీరప్రాంత జిల్లాలు జగత్సింగ్​పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్​లలో మంగళ, బుధ వారాల్లో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్​మృత్యుంజయ మహాపాత్ర హెచ్చరించారు. తుఫాన్​ ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 11 లక్షల మంది ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం వెల్లడించగా.. తీర ప్రాంత జిల్లాల్లో తుఫాను హెచ్చరికలు జారీ చేయడంతో పాటు సహాయక బృందాలను పంపించినట్లు బెంగాల్​ సర్కార్​ పేర్కొంది. 24 పరగాణాలు, కోల్​కతా, ఈస్ట్, వెస్ట్​ మిడ్నాపూర్, హౌరా, హూగ్లీ లలో తుఫాన్​ ప్రభావం ఉంటుందని, ఇప్పటికే అక్కడికి రిలీఫ్​ మెటీరియల్​తో పాటు సహాయక సిబ్బంది చేరుకున్నారని అధికారులు చెప్పారు.

కేరళలో భారీ వానలు

తుఫాన్​ ప్రభావంతో కేరళలో ఆదివారం రాత్రి పలుచోట్ల పెనుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. కొట్టాయం జిల్లాలోని వైకోమ్​ తాలూకాలో పెనుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు కూలిపోయాయి. రాత్రంతా కురిసిన వర్షానికి రోడ్లు డామేజ్​ కావడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది.

37 ఎన్డీఆర్ఎఫ్​ టీంలు..

తుఫాను హెచ్చరికలతో నేపథ్యంలో నేషనల్​ డిజాస్టర్​ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగింది. థబెంగాల్, ఒడిశాలలోని వివిధ ప్రాంతాలకు 37 టీంలను పంపించినట్లు ఎన్డీఆర్ఎఫ్​ డీజీ ఎస్ఎన్ ప్రధాన్​ చెప్పారు. ఇందులో 20 టీంలు యాక్టివ్​గా పలు ప్రాంతాల్లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండగా.. మిగతా 17 టీంలు స్టాండ్​బై గా ఉన్నాయని వివరించారు.

ఏర్పాట్లపై ప్రధాని మోడీ రివ్యూ

సైక్లోన్​ ఉంపన్​ ప్రభావం, సహాయక ఏర్పాట్లపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రివ్యూ మీటింగ్​ తర్వాత మోడీ ట్వీట్ చేశారు. ‘సైక్లోన్​కు ఎలా  రెడీ కావాలి, ప్రజల్ని సేఫ్​   ప్లేస్​లకు  ఎలా తరలించాలనే ఇష్యూలపై చర్చించాం. అందరూ క్షేమంగా, హ్యాపీగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కేంద్రం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’’ అని  ప్రధాని ట్వీట్ చేశారు.