- అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సరికొత్త సఫారీ రూట్
- త్వరలో పర్యాటకులకు అందుబాటులోకి..
- మూడు నెలల్లోనే 50 సార్లు పర్యాటకులకు కనిపించిన పులులు
హైదరాబాద్, వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులకు సరికొత్త అనుభూతి పంచేలా అటవీ శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో 20 కిలోమీటర్లు కొత్తగా ‘కొల్లం’సఫారీ మార్గాన్ని త్వరలో ప్రారంభించనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు రకాల సఫారీలను ఫారెస్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక చెంచులు నిర్వహిస్తున్నారు. పర్యాటకులు అడవి అందాలను వీక్షిస్తూనే.. పులుల గాంభీర్యాన్ని కళ్లారా చూసేందుకు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో కొత్తగా మరో సఫారీ రూట్ అందుబాటులోకి తీసుకురానున్నది.
కొల్లం పేరుతో పిలిచే ఈ కొత్త రూట్ ద్వారా పర్యాటకులను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అమ్రాబాద్‌లో ఉన్న సఫారీ రూట్లకు అదనంగా పర్యాటకుల డిమాండ్ మేరకు ఈ కొల్లం రూట్‌ను డిజైన్ చేశారు. ఇది సుమారు 20 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో సాగనుంది.
ఈ రూట్ పచ్చిక బయళ్లు, ఏపుగా పెరిగిన వెదురు బొంగుల మధ్య నుంచి సాగనుంది. ఈ ప్రయాణం పర్యాటకులకు ఎంతో హాయిని కలిగిస్తుందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ రూట్ సఫారీకి వెళ్లే పర్యాటకులకు పులులు ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మూడు నెలల్లో 50 సార్లు కనిపించిన పులులు..
అటవీ శాఖ చేపట్టిన సంరక్షణ చర్యలతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో గడిచిన మూడు నెలల్లో పర్యాటకులకు 50 సార్లు పులులు కనిపించడం విశేషం. సఫారీకి వెళ్తున్న వారికి ఎక్కడో ఒక దగ్గర పులులు కనిపిస్తుండటంతో టూరిస్టులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కేవలం పులులే కాకుండా చిరుతలు, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణులు కూడా సందడి చేస్తున్నాయి. ఇప్పటికే వీకెండ్స్‌లో అమ్రాబాద్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది.
ఇప్పుడు కొత్తగా 20 కిలోమీటర్ల కొల్లం రూట్ అందుబాటులోకి వస్తుండటంతో టైగర్ సఫారీకి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. 20 కిలోమీటర్ల మేర కొల్లం సఫారీ మార్గానికి సంబంధించి ఇప్పటికే రహదారి పనులను అధికారులు పూర్తి చేశారు. దీంతో త్వరలో అధికారికంగా ఈ రూట్‌ను ప్రారంభించనున్నారు.
మూడు రూట్లలో సఫారీ..
ప్రస్తుతం అమ్రాబాద్‌లో మూడు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. ఫరాహాబాద్ సఫారీ మెుత్తం 16 కిలోమీటర్ల ప్రయాణం కాగా.. 7 సీట్ల వాహనానికి రూ.3 వేలు, ఒకరికి రూ.430 చొప్పున చార్జ్ చేస్తున్నారు. గుండం సఫారీ దట్టమైన అడవిలో 35 కిలోమీటర్ల ప్రయాణం కాగా.. వాహనానికి రూ.5 వేలు, ఒకరికి రూ.715 చార్జ్ వసూలు చేస్తున్నారు. అక్కమహాదేవి గుహల సఫారీ 14 కిలీమీటర్ల మేర ప్రకృతి అందాల మధ్య ప్రయాణానికి 5 సీట్ల వాహనానికి రూ.3 వేలు, ఒకరికి రూ.600 చొప్పున తీసుకుంటున్నారు. ఈ సఫారీ కార్యకలాపాలన్ని స్థానిక చెంచు గిరిజనులే నిర్వహిస్తున్నారు.
మొత్తం 18 సఫారీ వాహనాలకు వారే డ్రైవర్లుగా, నేచర్ గైడ్‌లుగా వ్యవహరిస్తూ, పర్యాటకులకు అడవి గురించి వివరిస్తున్నారు. పర్యాటకుల ద్వారా సమకూరే ఆదాయాన్ని టైగర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ద్వారా స్థానిక గిరిజనుల జీవనోపాధికి వినియోగిస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా టైగర్ రిజర్వ్‌లోని ఫరాహాబాద్ వ్యూ పాయింట్, గుండం, దోమలపెంట వంటి ప్రాంతాల్లో బయో- టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పర్యాటకులు రాకపోకలు సాగించే చోట స్వచ్ఛమైన తాగు నీటి సౌకర్యం కల్పించారు. వన్యప్రాణుల కోసం అడవి లోపల సోలార్ బోర్ వెల్స్, నీటి కుంటలను నిర్వహిస్తున్నారు. అంతేకాదు, అవినీతికి తావులేకుండా చెక్-పోస్టుల వద్ద డిజిటల్ విధానాలను ప్రవేశపెట్టారు.
పర్యాటకులకు సరికొత్త అనుభూతి..
అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌లో కొల్లం సఫారీ రైడ్‌లో పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలగనున్నది. ఈ మార్గంలో పచ్చిక బయళ్లు, బ్యాంబో ప్యాచెస్ దట్టంగా ఉంటాయి. ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణంలో టూరిస్టులు రైడ్‌ను ఆస్వాదించవచ్చు.
గతంతో పోలిస్తే నల్లమల, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య పెరిగింది. ఈ కొత్త రూట్‌లో రైడ్‌కు వెళ్లే పర్యాటకులకు ఎక్కువగా పులులు కనిపించే చాన్స్ ఉంది. అటవీ శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో ఆమ్రాబాద్‌లో వన్యప్రాణులు, పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
- సునీల్ హెరేమత్, ఫీల్డ్ డైరెక్టర్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ సంరక్షణాధికారి-
