వన్యప్రాణుల సర్వేకు సర్వం సిద్ధం

 వన్యప్రాణుల సర్వేకు సర్వం సిద్ధం

అమ్రాబాద్, వెలుగు: ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్యప్రాణుల సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అమ్రాబాద్  టైగర్  రిజర్వ్  ఫీల్డ్  డైరెక్టర్  సునీల్  ఎస్. హెరామత్  తెలిపారు. సోమవారం మన్ననూర్  ఈసీ సెంటర్  వద్ద వలంటీర్ల శిక్షణ అందజేశారు. అడవిలో ఎలా నడుచుకోవాలి, ఎంస్క్రిప్ట్  మొబైల్  యాప్ లో వివరాలు ఎలా నమోదు చేయాలనే అంశాలతో పాటు మాంసాహార జంతువులు తారసపడ్డపుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.

అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లోని అచ్చంపేట, అమ్రాబాద్, నాగార్జునసాగర్  ఫారెస్ట్  డివిజన్లలో 254 బీట్ లు ఉండగా 231 బీట్ లలో సర్వే నిర్వహించేందుకు అవసరమైన మార్కింగ్, మాక్  డ్రిల్​ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. ఒక్క బీట్ కు ఒక ఫారెస్టర్​తో పాటు ఒక వలంటీర్ ను నియమించామని చెప్పారు. 20 నుంచి 25 వరకు ఆరు రోజుల పాటు జరిగే సర్వేలో మొక్కలు, మాంసాహార, శాఖాహార జంతుగణన చేపట్టి మొబైల్  యాప్ లో నమోదు చేస్తారని తెలిపారు.

153 మంది స్వచ్ఛంద వలంటీర్లు, స్టూడెంట్స్, సివిల్  సర్వీస్  స్టూడెంట్స్, స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. ఆరు రోజుల పాటు సమీప బేస్  క్యాంప్​లో వసతితో పాటు భోజన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారికి చివరి రోజున సర్టిఫికెట్  అందజేస్తామని, ఇది వారి భవిష్యత్  అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పారు. సర్వే దృష్ట్యా ఆరు రోజుల పాటు అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో సఫారీ సేవలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి 26 నుంచి సఫారీ సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.