
ఖలిస్థానీ నేత అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయిందుకు అమృత్‌పాల్ ఉపయోగించిన రెండో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌పాల్ కోసం శనివారం పోలీసులు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ చేపట్టినా..అతడు తప్పించుకున్నాడు. పోలీసులు వచ్చినట్లు తెలుసుకున్న అమృత్ పాల్ సింగ్ తన మెర్సిడెస్ వాహనాన్ని వదిలేసి బ్రెజా కారులో మరో రూట్ లో పారిపోయినట్లు తెలుస్తోంది.
సీసీ కెమెరాల్లో కనిపించాడు..
పోలీసుల నుంచి అమృత్ పాల్ తప్పించుకునే క్రమంలో అతడు సీసీ కెమెరాలకు దొరికిపోయాడు. మెర్సిడెస్ వాహనాన్ని వదిలేసిన అమృత్ పాల్...ఆ తర్వాత బైక్ పై వెళ్తు సీసీ కెమెరాల్లో కనిపించాడు. ఈ దృశ్యం శనివారం ఉదయం 11.27 గంటలకు జలంధర్‌లోని టోల్ బూత్ లోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. పంజాబ్ పోలీసులు అతన్ని అరెస్టు చేయడానికి ఆపరేషన్ ప్రారంభించిన రోజు మారుతీ బ్రెజ్జా కారులో ముందు సీట్లో ఉన్నట్లు కనిపించాడు. దీనికి ముందు అమృతపాల్ సింగ్ షాకోట్‌లోని రోడ్డు పక్కన మెర్సిడెస్ కారులో కనిపించాడు. కొన్ని గంటల తర్వాత అతను బ్రెజ్జా కారులోకి మారాడు. అతను కారులోనే బట్టలు మార్చుకున్నాడు. అమృత్‌పాల్ సింగ్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకునేందుకు పదే పదే దుస్తులను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు పంజాబ్ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేస్తుండగా ..పోలీసులు సోమవారం మెర్సిడెస్ కారును గుర్తించారు. అందులో కొన్ని ఆయుధాలతో పాటు బట్టలు ఉన్నట్లు గుర్తించారు. కారులోనే దుస్తులను మార్చుకుని..బైక్పై పంజాబ్ సరిహద్దులను దాటొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ నేపాల్ మీదుగా కెనడా పారిపోయే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమృత్‌పాల్ అనుచరుల్లో 114 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే నిందితుడి మామ హర్జీత్ సింగ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిపై జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హర్జీత్‌ను అస్సాంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. అమృత్‌పాల్ మరో ఐదుగురు అనుచరులపైనా NSA కేసులు ఫైల్ చేశారు.