
ముంబయి : ఓ డిజైనర్ తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) భార్య అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనిక్ష అనే మహిళ తనను బెదిరిస్తోందని, బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 20న చేసిన ఫిర్యాదులో ఆ మహిళ తండ్రిని కూడా చేర్చారు. ఆమె తండ్రికి సంబంధించిన ఒక క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవడానికి రూ.కోటి ఇవ్వజూపిందని ఫిర్యాదులో తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీనిపై తగిన విచారణ జరుపుతామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
2021 నవంబర్‌లో అనిక్ష అనే మహిళ తనను కలిసిందని, తానొక డిజైనర్ అని పరిచయం చేసుకుందని అమృతా ఫడ్నవీస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బయట జరిగే కార్యక్రమాల్లో తాను డిజైన్ చేసిన దుస్తులు,ఆభరణాలు, చెప్పులు ధరించాలని కోరిందని, దాని వల్ల తన ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని తనతో చెప్పిందని వివరించింది. తనతో మొదటి పరిచయంలోనే అనిక్ష తన కుటుంబ విషయాలు వెల్లడించిందని, తనకు తల్లి లేదని చెప్పిందని పేర్కొంది.‘ తర్వాత ప్రతిసారి మా సిబ్బందికి తన ఉత్పత్తులు ఇచ్చి, నాకు చేర్చమని చెప్పేది. వాటిని బహిరంగ కార్యక్రమాల్లో ధరించమని కోరేది. అయితే.. ఏదైనా కార్యక్రమంలో వాటిని ధరించానో లేదో నాకు గుర్తులేదు. మళ్లీ వాటిని ఆమెకు ఇచ్చేయమంటూ నా సిబ్బందికి చెప్పాను. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వస్తువులేవీ నా దగ్గర లేవు’ అని ఫిర్యాదులో అమృత పేర్కొంది.
మరోసారి తనను అనిక్ష కలిసినప్పుడు తన తండ్రికి పలు రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని చెప్పిందని అమృతా ఫడ్నవీస్ పేర్కొంది. ఒకరోజు తమ భద్రతా సిబ్బందిని ఏమార్చి తన కారులో కూర్చుందని, బుకీస్ గురించి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తాడని, దాంతో ఎలా డబ్బు సంపాదించవచ్చో చెప్పడంతో కారు ఆపి, ఆమెను దించేశానని తెలిపింది. మరోసారి ఫిబ్రవరి 16వ తేదీన తనకు ఫోన్ చేసి తన తండ్రి కేసు గురించి చెప్పి, అతడిని కేసు నుంచి బయటపడేస్తే.. రూ.కోటి ఇస్తానని చెప్పడంతో ఫోన్ కట్ చేసి, నంబర్ బ్లాక్ చేశానని పేర్కొంది.
ఫిబ్రవరి 18,19 తేదీల్లోనూ గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో క్లిప్స్, వాయిస్ మెసేజ్‌లు పంపిందని అమృత ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. అనిక్ష, ఆమె తండ్రిపై కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.