ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పొత్తు

ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ పొత్తు
  •     4 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ,3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి ఓకే
  •     అధికారికంగా ప్రకటించనున్నఇరు పార్టీల నేతలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు సీట్ల షేరింగ్ కూడా ఫైనల్ అయినట్టు సమాచారం. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్​సభ స్థానాలు ఉండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌‌, మధ్యప్రదేశ్‌‌లో సమాజ్‌‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌‌కు డీల్ ఫిక్స్ అయింది. ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా దాదాపు పూర్తయింది. తాజాగా గురువారం ఉదయమే ఢిల్లీలో ఆప్​తో కూడా పొత్తు ఫైనల్ అయినట్టు తెలిసింది. ఢిల్లీ నార్త్​వెస్ట్, ఢిల్లీ వెస్ట్, ఢిల్లీ సౌత్​తో పాటు ఢిల్లీ లోక్​సభ స్థానాల్లో ఆప్ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఢిల్లీ ఈస్ట్, ఢిల్లీ నార్తీస్ట్, చాందినీ చౌక్​ స్థానాల నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థులను బరిలోకి దించనున్నట్టు తెలిసింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది. ఆప్, కాంగ్రెస్ సీనియర్ లీడర్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంట్లో సమావేశం అయ్యారు. పొత్తులతో పాటు సీట్ల షేరింగ్​పై చర్చించారు. ఆప్ తరఫున మంత్రి అతిషీ పాల్గొన్నారు. మీటింగ్ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘లోక్​సభ ఎన్నికల విషయంలో పొత్తులపై కాంగ్రెస్​తో చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల షేరింగ్ విషయమై చర్చిస్తున్నాం. త్వరలోనే ఒప్పందం పూర్తయ్యే అవకాశం ఉంది’’అని ప్రకటించారు. 

పంజాబ్​లో కలిసే పోటీ చేస్తాయా?

పంజాబ్​లో మాత్రం ఆప్, కాంగ్రెస్ పొత్తుల విషయమై క్లారిటీ రాలేదు. ఢిల్లీ డీల్​ను పంజాబ్​లోనూ అమలు చేస్తారా? లేదా? వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ మొత్తం 13 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని పోయిన వారమే కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘ఆప్ అధికారంలోకి రాకముందు పంజాబ్ అభివృద్ధిని ఏ పార్టీ పట్టించుకోలేదు. వారి హయాంలో చేసిన మంచి పని చెప్పండి అంటే.. ప్రజలకు ఏమీ గుర్తుకు రావు. చండీగఢ్​లో కూడా మా పార్టీ అభ్యర్థిని నిలబెడ్తాం’’అని చెప్పారు. ‘‘పంజాబ్​లో ఆప్​తో కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉండటం సాధ్యం కాదు’’అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ప్రతాప్ సింగ్ బజ్వా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ కేడర్ కూడా ఇదే కోరుకుంటున్నదని తెలిపారు. అయితే, బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో కూడా సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీలూ ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. 

కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం, ఆమ్‌‌ ఆద్మీ పార్టీ చీఫ్ అర్వింద్‌‌ కేజ్రీవాల్‌‌ కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ డైరెక్టరేట్‌‌ (ఈడీ) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటిదాకా ఆరు సార్లు సమన్లు జారీ చేసినా  ఆయన పట్టించుకోలేదు. ఈ నెల 26న విచారణకు రావాలని తాజా గా గురువారం నాటి సమన్లలో ఈడీ కోరింది. సమన్లు చట్టవిరుద్ధమని, అందుకే కేజ్రీవాల్ విచారణకు వెళ్లడం లేదని ఆప్ నేతలు వాదిస్తున్నారు. ఈడీ కూడా కేజ్రీవాల్ ను పదేపదే విచారణకు హాజరు కావాలనికోరకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని అంటున్నారు.