వాయిస్​ రికార్డింగ్​ విని పార్కిన్​సన్స్​​, సివియర్ కొవిడ్​ని గుర్తు పట్టే యాప్​

వాయిస్​ రికార్డింగ్​ విని పార్కిన్​సన్స్​​, సివియర్ కొవిడ్​ని గుర్తు పట్టే యాప్​

బీపీ, గుండె జబ్బుల్ని ముందుగానే పసిగట్టే యాప్స్ వచ్చేశాయి. అలాగే  వాయిస్​ రికార్డింగ్​ విని పార్కిన్​సన్స్​​, సివియర్ కొవిడ్​ని గుర్తు పట్టే యాప్​ తయారుచేశారు ఆస్ట్రేలియాకు చెందిన రీసెర్చర్లు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేస్తుంది. ఈ యాప్​లో వాయిస్​ రికార్డు చేస్తే,  పది సెకన్లలో వాళ్లకు పార్కిన్​సన్స్​ డిసీజ్ ఉందా? లేదా? అనేది దాదాపు వంద శాతం కరెక్ట్​గా చెప్పేస్తుంది. ఒకవేళ పార్కిన్​సన్స్ ఉంటే న్యూరాలజిస్ట్​ని కలవాలని సజెస్ట్ చేస్తుంది. 

ఆస్ట్రేలియాలోని ఆర్​ఎంఐటీ (రాయల్ మెల్​బోర్న్  ఇనిస్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ) యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్లు ఈ యాప్​ తయారుచేశారు. పార్కిన్​సన్స్ ఉన్నవాళ్లలో స్వరపేటిక సరిగ్గా పనిచేయదు. దాంతో వాళ్ల మాట తీరు మారుతుంది. అందుకు కారణం... గొంతు దగ్గరి కండరాలు బిగుసుకుపోవడమే. అంతేకాదు శరీరం తూలుతున్నట్టు ఉండడం వల్ల  స్వరపేటిక నుంచి మాట సరిగ్గా రాదు. స్టడీలో భాగంగా పార్కిన్​సన్స్​తో బాధపడుతున్నవాళ్లని, ఆరోగ్యంగా ఉన్నవాళ్లను ఇంగ్లీష్​ అక్షరాలు ‘ఎ, ఒ, ఎమ్​’ పలకమని చెప్పి. వాళ్ల వాయిస్​ని వేరు వేరుగా రికార్డ్ చేశారు రీసెర్చర్లు. ఆ వాయిస్​ రికార్డ్​ని యాప్​లో ప్లే చేశారు. పార్కిన్​సన్స్ ఉన్నవాళ్ల గొంతుని ఆరోగ్యంగా ఉన్నవాళ్ల గొంతుతో  పోల్చి చూస్తుంది ఇందులోని సాఫ్ట్‌‌వేర్. పార్కిన్​సన్స్​ ఉన్నవాళ్లు ఈ మూడు అక్షరాల్ని ఒకేలా పలకడం గమనించారు. మామూలుగా ఈ డిసీజ్​ ఉందా? లేదా? అనేది తెలుసుకోవడానికి 90 నిమిషాలు పడుతుంది. ఈ యాప్ అయితే కేవలం పది సెకన్లలో పార్కిన్​సన్స్​ టెస్ట్ పూర్తి చేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్​లో ఉంది ఈ యాప్.  

ఊపిరితిత్తుల సమస్యల్ని కూడా...
‘‘ఆరోగ్య సమస్యల్ని ముందుగానే గుర్తించడం వల్ల త్వరగా డయాగ్నసిస్, ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుంది. ఏ జబ్బు అయినా తొందరగా నయం కావాలంటే దాన్ని తొందరగా పసిగట్టడం చాలాముఖ్యం. కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినవాళ్లలో కూడా గొంతు మారుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాటిని కూడా గుర్తించొచ్చు. ఈ యాప్​ ద్వారా వ్యాధుల్ని గుర్తించడం చాలా ఈజీ. డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కావు” అని చెప్తున్నాడు ఈ స్టడీలో పాల్గొన్న ప్రొఫెసర్ దినేశ్ కుమార్. మనదేశానికి చెందిన ఈయన ఐఐటీ ఢిల్లీలో పీహెచ్​డీ చేశాడు. ప్రస్తుతం ఆర్​ఎంఐటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడు.