దళిత బంధు ఇవ్వాలంటూ సీఎం దిష్టిబొమ్మ దహనం

దళిత బంధు ఇవ్వాలంటూ సీఎం దిష్టిబొమ్మ దహనం

జోగిపేట: అర్హులైన దళితులకే దళితబంధు ఇవ్వాలంటూ సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల పరిధిలోని మన్‌సాన్‌పల్లికి చెందిన దళితులు బుధవారం జోగిపేటలో జాతీయ రహదారిపై సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే పథకాన్ని వర్తింపజేస్తున్నారంటూ ఆరోపించారు. మన్‌సాన్‌పల్లిలో 126 దళిత కుటుంబాలుండగా, కేవలం 8 కుటుంబాలకు మాత్రమే ఇచ్చారన్నారు. అధికారులు గ్రామ సభలు పెట్టి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. 
నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లేశం ఆందోళనకు మద్దతును ప్రకటించారు. ఆందోళనతో వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు సర్ధి చెప్పి విరమింపజేశారు. తర్వాత ఎంపీడీవో ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి సూపరింటెండెంట్​అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. 

మెదక్​ జిల్లా తిమ్మాపూర్​లో ..
రేగోడ్:  దళితబంధును బీఆర్ఎస్ లీడర్లకే ఇస్తున్నారని ఆరోపిస్తూ మెదక్​జిల్లా రేగోడ్ మండల పరిధిలోని తిమ్మాపూర్ లో బుధవారం తిమ్మాపూర్ వార్డు మెంబర్లు, దళితులు ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు ముందు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఎంపీడీవో ఆఫీసులోకి పంపించారు. అయితే, ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు.