నా కొడుకును బతికించండి..బ్లడ్‌‌ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న ఎనిమిదేండ్ల చిన్నారి

నా కొడుకును బతికించండి..బ్లడ్‌‌ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న ఎనిమిదేండ్ల చిన్నారి
  • ఇప్పటికే రూ. 7 లక్షలు ఖర్చు, ట్రీట్‌‌మెంట్‌‌కు మరో రూ. 40 లక్షలు
  • దాతలు సహకరించాలని కోరుతున్న బాలుడి తండ్రి

జమ్మికుంట, వెలుగు : ఫ్రెండ్స్‌‌తో కలిసి సరదాగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. క్యాన్సర్‌‌తో బాధపడుతూ 25 రోజులుగా హాస్పిటల్‌‌ బెడ్‌‌కే పరిమితం అయ్యాడు. కొడుకును ఎలాగైనా బతికించుకోవాలనుకున్న తండ్రి ఇప్పటికే రూ. 7 లక్షలు ఖర్చు చేశాడు. చిన్నారి ట్రీట్‌‌మెంట్‌‌కు మరో రూ. 40 లక్షలు అవసరం కావడం, అంత స్థోమత తనకు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. దాతలెవరైనా ముందుకు వచ్చి తన కొడుకును బతికించాలని వేడుకుంటున్నాడు.

వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మండలంలోని మాచనపల్లి గ్రామానికి చెందిన బండారి శ్యాంసుందర్‌‌, స్రవంతి దంపతులకు కొడుకు శ్రీహాన్‌‌, కూతురు ఉన్నారు. ఎనిమిదేళ్ల శ్రీహాన్‌‌ కొన్ని రోజుల కింద అస్వస్థతకు గురికావడంతో స్థానిక హాస్పిటల్‌‌లో టెస్ట్‌‌ చేయించగా ప్లేట్‌‌లెట్స్‌‌ తక్కువగా ఉండడంతో హైదరాబాద్‌‌లోని రెయిన్‌‌బో హాస్పిటల్‌‌కు తరలించారు.

అక్కడ ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్న క్రమంలో బాలుడికి బ్లడ్‌‌ క్యాన్సర్‌‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతాయని డాక్టర్లు చెప్పారు. శ్యాంసుందర్‌‌ ఇప్పటికే రూ. 7 లక్షల వరకు ఖర్చు చేశాడు. ఇక వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో డబ్బుల కోసం నానా అవస్థలు పడుతున్నాడు. దాతలెవరైనా స్పందించి ట్రీట్‌‌మెంట్‌‌కు సహకరించాలని, ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని శ్రీహాన్‌‌ కుటుంబసభ్యులు కోరుతున్నారు.