హోంవర్క్ చేయలేదని పుస్తకాల బ్యాగ్ మెడకు వేసిన టీచర్

హోంవర్క్ చేయలేదని  పుస్తకాల బ్యాగ్ మెడకు వేసిన టీచర్

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: హోంవర్క్ చేయలేదని టీచర్ ఇచ్చిన పనిష్ మెంట్​కు ఎనిమిదేండ్ల చిన్నారి బలైంది. పుస్తకాలు నింపిన బ్యాగ్ చిన్నారి మెడకు వేసి మోయించడంతో అస్వస్థతకు గురై ట్రీట్​మెంట్ పొందుతూ చనిపోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎన్నారై కాలనీలోని వుడ్ బ్రిడ్జి స్కూల్​లో జరిగింది. ఈ స్కూల్​లో అర్సపల్లికి చెందిన మంతాషా ఫాతిమా(8) రెండో తరగతి చదువుతోంది. అయితే 3న హోంవర్క్ చేయలేదని ఫాతిమాపై క్లాస్ టీచర్ కోప్పడింది. బ్యాగులో పుస్తకాలు నింపి బాలిక మెడపై వేసి అటూఇటూ తిప్పుతూ మోయించింది. దీంతో ఫాతిమా అస్వస్థతకు గురైంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం చనిపోయింది. 

విద్యార్థి సంఘాల ఆందోళన..

ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగా యి. స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మంగళవారం నిజామాబాద్ ఎంఈఓ పాఠశాలను సందర్శించారు. కానీ మేనేజ్ మెంట్ ఎవరూ అందుబాటులో లేరు. ఈ ఘటనపై డీఈఓ దుర్గాప్రసాద్​ను వివరణ కోరగా..  స్కూల్​ను మూసివేయాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఎంఈఓ రామారావు ఎంక్వయిరీ చేస్తున్నారని, రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి తమకు ఎలాంటి కంప్లయింట్ రాలేదని ఆరో టౌన్ ఎస్ఐ సాయిబాబ గౌడ్ తెలిపారు. కాగా, చిన్నారి పేరెంట్స్ తో స్కూల్ మేనేజ్ మెంట్ సెటిల్ మెంట్ చేసుకుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్ ఆరోపించారు.