ఎన్నికలొస్తే వార్ రూమ్​లు పెడ్తరు.. వరదలొస్తే కంట్రోల్ రూమ్ లేవీ

ఎన్నికలొస్తే వార్ రూమ్​లు పెడ్తరు.. వరదలొస్తే కంట్రోల్ రూమ్ లేవీ

రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఫైర్ 
బాధితులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకున్నరు?
సహాయక చర్యల వివరాలన్నీ అందజేయాలని ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 31కి వాయిదా 

హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదలతో జనం ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్ రూమ్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఎన్నికలొస్తే ఆగమేఘాల మీద వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు. మరి వరదలొచ్చినప్పుడు మాత్రం కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయరా?” అని ఫైర్ అయింది. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారా? వరదల కారణంగా ఎంతమంది చనిపోయారు? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటి వరకు ఏం చేశారు? ఏం చేయబోతున్నారో వివరిస్తూ సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని చెరుకు సుధాకర్‌‌ 2020లో హైకోర్టులో పిల్‌‌ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు, వరదల నేపథ్యంలో అత్యవసరంగా విచారించాలని శుక్రవారం దానికి అనుబంధ పిటిషన్ వేశారు. దీనిపై సీజే అలోక్ అరాధే, జస్టిస్‌‌ టి.వినోద్‌‌ కుమార్‌‌ తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ విచారణ చేపట్టింది.  

ఎంతమంది చనిపోయారు? 
పిటిషనర్‌‌ తరఫున లాయర్లు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రత్యూష్‌‌ కుమార్‌‌ వాదనలు వినిపించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘నిర్మల్‌‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం లేదు. దీంతో ప్రాజెక్టు పైనుంచి వరద వస్తున్నది. ఒకవేళ ప్రాజెక్టు తెగిపోతే దిగువ గ్రామాల్లోని జనం పరిస్థితి ఏంటి? ఆ గ్రామాలన్నీ మునిగిపోయే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. ముంపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  ఎన్నికలొస్తే వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తారు కానీ, వరదలొస్తే బాధితులను ఆదుకునేందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయరా? అని ఫైర్ అయింది. వరదల వల్ల ఎంతమంది చనిపోయారని ప్రశ్నించింది. వరద బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, అక్కడ కల్పించిన సౌలతులు, ఇతర అన్ని వివరాలు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.


కడెం ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించారా? బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారా? బాధితులను ఆదుకునేందుకు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారా? ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున గంటగంటకూ పరిస్థితులను సమీక్షించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గ్రహించాలి. ఈ పిల్‌‌ ప్రభుత్వానికి వ్యతిరేకమని అనుకోవద్దు. జనం కష్టాల్లో ఉన్నప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.