పాకిస్తాన్​ వ్యూహాన్ని తిప్పికొడుతున్న భారత్ సుదర్శన చక్రం S -400

పాకిస్తాన్​ వ్యూహాన్ని తిప్పికొడుతున్న భారత్ సుదర్శన చక్రం S -400

భారతదేశ చరిత్రలో ఆపరేషన్  సిందూర్ ఒక గొప్ప చారిత్రత్మక ఘటన.  మన దేశ సరిహద్దుల్లోకి వచ్చి, భారత బిడ్డలని నిర్దాక్షిణ్యంగా చంపడమే కాకుండా,  ‘వెళ్లి మీ దేశ ప్రధాని మోదీ’కి చెప్పుకోండి అని దురహంకారాన్ని ప్రదర్శించిన ఉగ్రవాదులను, నేడు భారత్​ నిర్దాక్షిణ్యంగా ఏరి పారేస్తోంది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్​ త్రివిధ దళాల బలం, ఐక్యత, శక్తిసామర్థ్యాలు మరొక్కసారి ప్రపంచానికి తెలియజేసింది.  భారత్  భూభాగంలోని జమ్మూ కాశ్మీర్,  పంజాబ్, రాజస్థాన్​లోని కీలకమైన స్థానిక, పౌర స్థావరాలను గురిగా పెట్టుకుని క్షిపణులు, డ్రోన్లను  భారత్ పైకి పాకిస్తాన్ ​వదిలింది.

 ఇంత పెద్ద దాడిని  భారత భద్రతా బలగాలు సునాయసంగా ఎస్ 400 క్షిపణితో  విజయవంతంగా ఎదుర్కొన్నాయి.  దీనివల్ల భారత్  సరిహద్దు ప్రాంతాలలో  ప్రాణ, ఆస్తినష్టాలు జరగకుండా కాపాడుకోగలిగాం. 

ప్రపంచవ్యాప్తంగా బలమైన సైనిక శక్తుల్లో  ఒకటైన భారత్  ప్రాంతీయ భద్రతను నిర్ధారించడంలో,  వ్యూహాత్మక లక్ష్యాలను నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. 2013-–14లో  రూ.2,53,346 కోట్లుగా ఉన్న దేశరక్షణ బడ్జెట్ గణనీయంగా పెరిగి 2024–-25 నాటికి రూ.6,21,940.85 కోట్లకు చేరుకుంది. 2023-–24 లో భారత దేశీయ రక్షణ ఉత్పత్తి  రూ.1.27 లక్షల కోట్లకు  చేరుకుంది. ఇది 2014-–15లో రూ.46,429 కోట్ల నుంచి సుమారు 174% పెరిగింది.

 రక్షణ ఎగుమతులు 2004-14 దశాబ్దంలో రూ.4,312 కోట్ల నుంచి 2014-24 దశాబ్దంలో  రూ.88,319 కోట్లకు 21 రెట్లు పెరిగాయి.  రష్యా ఆర్మీ పరికరాల్లో 'మేడ్ ఇన్ బిహార్' బూట్లను చేర్చడం ఒక ముఖ్యమైన మైలురాయి.  ఇది ప్రపంచ రక్షణ మార్కెట్లో భారతదేశం ఉన్నత  తయారీ  ప్రమాణాలను హైలైట్ చేస్తుంది.  

రష్యా నుంచి మూడు ఎస్ 400 యూనిట్లు 

ఎస్ 400  క్షిపణి  భారత్​ సుదర్శన చక్రంగా గుర్తింపు పొందింది.  మనదేశం ఈ క్షిపణి కోసం 2018లో 35 వేల కోట్లతో కొనుగోలు చేసేవిధంగా రష్యాతో  ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా మొత్తం ఐదు ఎస్ 400 యూనిట్లు కొనుగోలు చేస్తుంది. ఇప్పటివరకు మూడు ఎస్ 400 యూనిట్లు భారత్ లో ఉన్నాయి. మిగతా రెండు 2026కల్లా రానున్నాయి. ప్రతి ఎస్ 400 యూనిట్ ఒకేసారి 160 లక్ష్యాలను ట్రాక్ చేసి 72 లక్ష్యాలపైన దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉంది. 

వీటి పరిధి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. అంతేకాకుండా గరిష్టంగా 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగల శక్తి ఉన్నది.  ఎస్-400 క్షిపణి లాంచర్లు, శక్తిమంతమైన రాడార్, కమాండ్ సెంటర్ అనే మూడు భాగాలను కలిగి ఉంది. ఇది విమానాలు,  క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను కూడా ఛేదించగలదు. ఎస్-400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను మోసుకెళ్లగలదు. దీని రాడార్ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదు.

అమెరికా ఒత్తిడికి తలొగ్గని భారత్​

2018లో ఈ క్షిపణిని  కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒప్పందాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది.  భారత్  ఎస్400 యుద్ధ విమానాలను కొనుగోలు చేసినట్లయితే అమెరికా భారత్ పైన ఆంక్షలు విధిస్తామని ఆంక్షలు చట్టం కింద హెచ్చరించింది.  ఈ క్షిపణి  వ్యవస్థ  కొనుగోలును రద్దు చేయాలని భారత్​ను ఏళ్ల తరబడి అమెరికా ఒత్తిడి తెచ్చినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు.  మొదటి ఎస్ 400 క్షిపణి 2021లో  భారత్  చేరింది.  ఒకప్పుడు భారత్, అమెరికా సంబంధాల్లో కీలకంగా ఉన్న అంశం ఇప్పుడు భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి  చిహ్నంగా మారింది.  

అమెరికాతో  సత్సంబంధాలను కొనసాగిస్తూనే, అదే సమయంలో తన రక్షణ శాఖను బలోపేతం చేయటంలో ఉన్నతస్థాయి దౌత్య భాగస్వామ్యం ద్వారా భారతదేశం ముందుకు వెళ్లగలిగింది. అవే  భారత ప్రభుత్వ రక్షణ ఒప్పందాలు, విలువైన ఆయుధ సంపత్తి  నేడు భారత్​కు  శ్రీరామరక్షగా ఉంది.  ఆనాడు ఎస్ 400 కొనుగోలు ఒప్పందాలను విమర్శించిన నోళ్లే  నేడు భారత్ రక్షణశక్తిని కొనియాడుతుండడాన్ని కూడా గమనించాలి.

దేశ రక్షణే ప్రథమ కర్తవ్యం

ఆనాడు భారత్ ఎస్400 క్షిపణులు కొనుగోలు చేసినప్పుడు, ఇది పాకిస్తాన్​ను  ప్రేరేపించే చర్యగా ఉందని పాకిస్తాన్ అభివర్ణించింది.  చైనాకు సైతం ఎస్400 క్షిపణి ఉంది. భారతదేశం కూడా దీనిని సరిహద్దుల్లో  మోహరించడం వల్ల  చైనాపై కూడా వ్యూహాత్మక ఒత్తిడి పెరిగింది. భారత్ చైనా నుంచి వచ్చే ఎటువంటి క్లిష్టపరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉన్నది. నేటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ సుదర్శన చక్రమే రక్షణ కవచంగా మారింది. భారత వాయుసేనలో ఇప్పటికే  ఫ్రెంచ్ రాఫెల్, అమెరికన్ సి 47, అపాచీ,  తేజస్ వంటి అనేక రకాలైన ఆధునిక పరికరాలు ఉన్నాయి. ఆయుధ సంపత్తితోపాటు, వ్యూహాత్మకమైన మేధోసంపత్తితో భారత్ ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టగలుగుతోంది.

ప్రపంచ దేశాల మద్దతు

ఎస్400 ప్రధాన ఉత్పత్తిదారు రష్యా.  భారత్ కాకుండా చైనా కూడా రష్యా దగ్గర నుంచి 2014లోనే  వీటిని కొనుగోలు చేయడం జరిగింది. రష్యా నుంచి కొనుగోలు చేసిన మొదటి దేశం  చైనా.  బెలారస్ కూడా 2021లో దీన్ని పొందడం జరిగింది. టర్కీ కూడా కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పటికీ అమెరికా నిషేధాజ్ఞలు విధించింది.  సౌదీ అరేబియా సైతం కొనుగోలుకు ఆసక్తి చూపించినప్పటికీ అమెరికాపై కీలకంగా ఆధారపడుతుడటంతో, ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. 

ఈజిప్టు కూడా  కొనుగోలు చేసినట్టు వార్తలు ఉన్నా అధికారికంగా ఆ దేశం ఎక్కడ ప్రకటించిన దాఖలాలు లేవు. ఎస్ 400  దీర్ఘశ్రేణి  సామర్థ్యాల కారణంగా  నాటో సభ్య దేశాలు ప్రధాన ముప్పుగా  పరిగణిస్తున్నాయి. ఆపరేషన్  సిందూర్​పై ప్రపంచ దేశాలన్నీ భారత్​కు మద్దతు తెలుపుతున్నాయి.  ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. 

- చిట్టెడి కృష్ణారెడ్డి,అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ–