Telangana jobs special: ప్రభుత్వ రంగం

Telangana jobs special: ప్రభుత్వ రంగం

స్వాతంత్ర్యం వచ్చేనాటికి రైల్వేలు, విద్యుత్, నీటిపారుదల, ఓడరేవులు, కమ్యూనికేషన్​ వంటి కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వం పరిమితమైంది. స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వరంగం వేగంగా విస్తరిస్తూ వచ్చింది. 1948, 1956 పారిశ్రామిక తీర్మానాలు ప్రైవేట్, ప్రభుత్వరంగాల పాత్రను స్పష్టీకరించాయి. ఇవి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యత ఇచ్చాయి. భారీ మౌలిక పరిశ్రమలను ప్రభుత్వరంగానికి, వినియోగ వస్తు పరిశ్రమలను ప్రైవేట్​ రంగానికి కేటాయించారు. ఇవికాకుండా బ్యాంకులు, రైల్వేలు, వైమానిక, రవాణా తదితర వాటిని ప్రభుత్వరంగానికి రిజర్వ్​ చేశారు. ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగమంతా ప్రైవేట్​ రంగానికి విడిచి పెట్టారు.


భారీ మౌలిక పరిశ్రమలను(ఇనుము, ఉక్కు, హేవీ ఇంజినీరింగ్, హెవీ ఎలక్ట్రికల్​ మొదలైనవి) ప్రభుత్వరంగానికి, వేగంగా ఫలితానిచ్చే వినియోగ వస్తు పరిశ్రమలను ప్రైవేట్​రంగానికి అప్పగించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ పెట్టుబడులు లాభాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉంటాయి. దీర్ఘ ఫలన కాలం ఉంటుంది. లాభాల రేటు తక్కువగా ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యం అవసరమవుతుంది. క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం అవసరమవుతుంది. సమన్వయం కూడా కష్టంగా ఉంటుంది. అందుకే వీటిని ప్రభుత్వానికి కేటాయించారు. ప్రభుత్వ పెట్టుబడి లేని అటానమస్​ పెట్టుబడులు, వేగంగా ఫలితాలనిచ్చే వస్తు ఉత్పత్తి ప్రైవేట్​రంగానికి అప్పగించారు. దీనికి దిగుమతులు అంతగా అవసరం ఉండదు. లాభాలు వచ్చే కొద్దీ ఉత్పత్తిదారులకు ప్రేరణ పెరుగుతుంది.


ఏ సంస్థలోనైనా కేంద్ర లేదా రాష్ట్ర లేదా ప్రాంతీయ ప్రభుత్వాలకు 51శాతం, అంతకంటే ఎక్కువ శాతం వాటాను కలిగి ఉంటే దాన్ని ప్రభుత్వరంగ సంస్థగా పరిగణించవచ్చు. 
ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడేవి: వీటికి పెట్టుబడి పూర్తిగా ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఇవి పార్లమెంట్​కు బాధ్యత వహిస్తాయి. ఉదా: రైల్వేలు, పోస్టల్, టెలిగ్రామ్​, ఆల్​ ఇండియా రేడియో.  
పబ్లిక్​ కార్పొరేషన్స్​: ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా వీటిని స్థాపిస్తుంది. పూర్తి వాటా ప్రభుత్వానిదే. ఉదా: ఎల్​ఐసీ, దామోదర్​ వ్యాలీ కార్పొరేషన్​, ఆర్​బీఐ. 
ప్రభుత్వ కంపెనీలు: కంపెనీ చట్టం–1956 ద్వారా ఇవి ఏర్పాటవుతాయి. దీనికి ప్రభుత్వం ఏకైక వాటాదారుగా గానీ, అత్యధిక వాటాదారుగా గానీ ఉంటుంది. ఉదా: హెచ్​ఎంటీ, బీహెచ్​ఈఎల్​, బీఈఎల్​.


ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అని విడదీస్తారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు అంటారు. ఇవి భారీ పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతాయి. వాణిజ్య సామర్థ్యం, సామాజిక బాధ్యత అనే లక్ష్యాలతో నిర్వహించబడుతున్నాయి. 1951లో ప్రభుత్వరంగ సంస్థలు ఐదు ఉండేవి. వీటిలో పెట్టుబడి రూ.29కోట్లు. 2020 మార్చి నాటికి 366కు చేరాయి. వీటిలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. లభించిన ఆర్థిక స్వయం ప్రతిపత్తినిబట్టి సీపీఎస్​ఈలను మినీ రత్న, నవరత్న, మహారత్న అని మూడు రకాలుగా విడదీస్తారు.


మహారత్న: దీనిని 2009లో ప్రవేశపెట్టారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వరంగ సంస్థలు తమ కార్యకలాపాల విస్తరణకు అంతర్జాతీయ సంస్థలుగా ఎదిగేందుకు దోహదపడుతాయి. దీనిని పొందడానికి నవరత్న హోదా పొంది ఉండాలి. మూడేండ్లు లాభం పొందుతూ ఒక సంవత్సర నికర లాభం రూ.5000 కోట్లు ఉండాలి. గత మూడు సంవత్సరాల్లో సగటు నికర లాభాన్ని తీసుకుంటారు. నికర ఆస్తులు రూ.15,000 కోట్లు ఉండాలి. వార్షిక టర్నోవర్​ రూ.25,000 కోట్లు ఉండాలి. స్టాక్​ మార్కెట్​లో నమోదై షేర్లు ట్రేడింగ్​ అవుతూ ఉండాలి. భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రి ఈ హోదా ఇవ్వడంపై నిర్ణయం తీసుకుంటారు. పెట్టుబడి నిర్ణయంలో నెట్​వర్త్​లో 15 శాతం, గరిష్ఠంగా రూ.5000 కోట్ల వరకు ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు.

స్వేచ్ఛనిచ్చేందుకు, అంతర్జాతీయ సంస్థలుగా ఎదిగేందుకు, అధిక లాభాలతో నడుస్తున్న సంస్థలకు ఈ హోదాను ఇస్తారు.  2022, జులై నాటికి 12 మహారత్న సంస్థలు ఉన్నాయి. అవి.. ఆయిల్​ నేచురల్​ గ్యాస్​ కార్పొరేషన్​ లిమిటెడ్​, నేషనల్​ థర్మల్​ పవర్​ కార్పొరేషన్​, స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్, ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​ లిమిటెడ్, కోల్​ ఇండియా లిమిటెడ్​, భారత్​ హెవీ ఎలక్ట్రికల్స్​ లిమిటెడ్, గ్యాస్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్, భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​ లిమిటెడ్​, హిందూస్తాన్​ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్​, పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​ ఇండియా లిమిటెడ్​, పవర్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ లిమిటెడ్​, రూరల్​ ఎలక్ట్రిఫికేషన్​ లిమిటెడ్​. 


నవరత్న: నవరత్న అంటే ఆభరణం అని అర్థం. దీన్ని 1997లో ప్రవేశ పెట్టారు. నవరత్న హోదా పొందేందుకు కింది అర్హతలు కలిగి ఉండాలి.  వరుసగా మూడు సంవత్సరాల నుంచి లాభాలనార్జిస్తూ సగటున 1000 కోట్లు లాభం రావాలి. రుణాల వడ్డీ చెల్లింపుల్లో వైఫల్యం చెందొద్దు. నిర్వహణా ఖర్చుల కోసం బడ్జెట్​ కేటాయింపులపై ఆధారపడరాదు. ప్రభుత్వం సూచించిన ఆరు సూచీల్లోని100 మార్కులకు 60 మార్కులు రావాలి. నవరత్న హోదా పొందేందుకు అది మినీరత్న హోదా పొంది ఉండాలి. 
నవరత్న కంపెనీలు: భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​, కంటైనర్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా లిమిటెడ్, ఇంజినీర్స్​ ఇండియా లిమిటెడ్​, హిందూస్తాన్​ ఎరోనాటిక్స్​ లిమిటెడ్​, మహానగర్ టెలిఫోన్​ నిగమ్​ లిమిటెడ్​.

లాభాలు, నష్టాలు పొందే పీఎస్​యూలు

భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో భారీ పరిశ్రమల విభాగం, ప్రభుత్వ సంస్థల విభాగం ఉంటాయి. డిపార్ట్​మెంట్​ ఆఫ్​ పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​, మినిస్ట్రీ ఆఫ్​ హెవీ ఇండస్ట్రీస్​ అండ్​ పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​ 61వ నివేదికను ప్రకటించింది. 2021లోని సీపీఎస్​ఈలు 389. కాగా వీటిలో నిర్వహించబడేవి 255, నిర్మాణంలో ఉన్నవి 108. 26 సీపీఎస్​ఈలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. 61 సీపీఎస్ఈలు లిస్టెడ్​ అయ్యాయి. వీటిలో 2021, మార్చి నాటికి వ్యవసాయ రంగంలో 3, మైనింగ్​లో 25, మాన్యుఫ్యాక్చరింగ్​లో 110, సేవల్లో 143, నిర్మాణంలో 108, మొత్తం 389 ఉన్నాయి.

మినీరత్న : 1997లో మినీరత్న హోదాను సృష్టించారు. వరుసగా మూడేండ్లు లాభాలు పొందుతూ లాభం రూ.30 కోట్లు దాటితే మినీరత్న-1, రూ.30 కోట్ల కంటే తక్కువ ఉంటే మినీరత్న-2 హోదానిస్తారు. ఇవి కూడా రుణాల చెల్లింపుల్లో వైఫల్యం చెందొద్దు. నిర్వహణ ఖర్చుల కోసం బడ్జెట్​ కేటాయింపులపై ఆధారపడరాదు. నికర ఆస్తులు ధనాత్మకంగా ఉండాలి. ఈ హోదాను పొందితే మినీరత్న-1 రూ.500 కోట్ల వరకు లేదా దాని ఆస్తుల విలువకు సమానంగా పెట్టుబడి నిర్ణయాల్లో స్వేచ్ఛ కలిగి ఉంటాయి. మినీరత్న-2 రూ.300 కోట్లు లేదా నికర విలువలో 50 శాతం వరకు పెట్టుబడి స్వేచ్ఛ కలిగి ఉంటాయి. ఇవి కూడా మూలధన వ్యయం, జయింట్​ వెంచర్​లోకి ప్రవేశించడం, విదేశాల్లో ఆఫీసులు కలిగి ఉండటం, అనుబంధ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం, సాంకేతిక వ్యూహాత్మక ఒప్పందాలు, మానవ వనరుల అభివృద్ధిలో స్వేచ్ఛను కలిగి ఉంటాయి. ​2022, ఫిబ్రవరి నాటికి మినీరత్న హోదా-1(62), మినీరత్న హోదా-2(12) కలిపి మొత్తం 74 ఉన్నాయి.