ఎల్‌ఐసీ షేరుకి ఏమైంది!

ఎల్‌ఐసీ షేరుకి ఏమైంది!
  • గత 23 రోజుల్లో 25 శాతం పతనం
  • రూ. 1.40 లక్షల కోట్లు నష్టపోయిన ఎల్‌ఐసీ ఇన్వెస్టర్లు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌, వెలుగు : ‘ ఈ ఏనుగు డ్యాన్స్ చేయలేకపోతోంది’.. ఎల్‌‌ఐసీ షేరుపై ఎనలిస్టులు చేస్తున్న వ్యాఖ్యలివి. ఎన్నో అంచనాల మధ్య మార్కెట్‌‌లో లిస్టింగ్ అయిన ఈ కంపెనీ, ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. ఐపీఓ ఇష్యూ ధర రూ. 949 అయితే, గురువారం సెషన్‌‌లో ఎల్‌‌ఐసీ షేరు రూ. 721.60 వద్ద ఆల్‌టైమ్‌ కనిష్టాన్ని రికార్డ్ చేసింది. అంటే గత 23 రోజుల్లోనే కంపెనీ షేరు వాల్యూ 25% పతనమైంది. ఎల్‌‌ఐసీ ఇన్వెస్టర్లు ఏకంగా రూ. 1.40 లక్షల కోట్లు నష్టపోయారు. ఐపీఓ ధర దగ్గర ఎల్‌‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,00,242 కోట్లు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 4,58,024 కోట్లకు పడిపోయింది.  ప్రస్తుతం మార్కెట్ క్యాప్ పరంగా ఏడో పొజిషన్‌‌లో ఉంది. ఎల్‌‌ఐసీ షేరు గురువారం సెషన్‌‌లో 2.23 % నష్టపోయి క్లోజయ్యింది. 

ఎందుకు పడుతోందంటే..
ఎల్‌‌ఐసీ క్యూ4 రిజల్ట్స్‌‌ ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయని ఎనలిస్టులు అంటున్నారు. కంపెనీ ప్రాఫిట్‌‌ క్యూ4 (ఏడాది ప్రాతిపదికన) లో 17% తగ్గి  రూ. 2,409 కోట్లుగా రికార్డయ్యింది. దీనికి తోడు  వ్యవస్థలో లిక్విడిటీని తగ్గించే చర్యలను ఆర్‌‌‌‌బీఐ తీసుకుంటోంది. దీని ఎఫెక్ట్‌‌ కూడా కంపెనీ షేరుపై పడుతోందని  ఎనలిస్టులు అంటున్నారు.  ఎల్‌‌ఐసీ విదేశీ ఇన్వెస్టర్లను (ఎఫ్‌‌ఐఐ) ఆకర్షించడంలో ఫెయిలయ్యింది. ఐపీఓ టైమ్‌‌లో ఎఫ్‌‌ఐఐల పోర్షన్‌‌  పెద్దగా సబ్‌‌స్క్రయిబ్ కాని విషయం తెలిసిందే. ఎఫ్‌‌ఐఐల నుంచి బయ్యింగ్ లేకపోవడంతో షేరు పెరగడంలో ఇబ్బంది పడుతోంది. మరోవైపు ఎల్‌‌ఐసీ లాంటి పెద్ద కంపెనీ వాల్యుయేషన్‌‌ను ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలతో పోల్చి చూసుకోవడానికి వీలులేకపోవడంతో కూడా ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతున్నారని ఫ్రొఫిసియంట్ ఈక్విటీస్ ఫౌండర్ మనోజ్ దాల్మియా అన్నారు. ‘ఎల్‌‌ఐసీ షేరు లిస్టింగ్ అయిన తర్వాత నుంచి పడుతుండడం చూస్తున్నాం. కంపెనీ క్యూ4 రిజల్ట్స్‌‌ అంచనాలను అందుకోకపోవడం, ఐపీఓ ధర కంటే తక్కువకు లిస్టింగ్ అవ్వడంతో షేరు పడుతోంది. ఎల్‌‌ఐసీ డైరెక్ట్‌‌ సేల్స్‌‌లో ముందున్నా, ఆన్‌‌లైన్ సేల్స్‌‌లో  పోటీ కంపెనీలతో పోలిస్తే వెనకబడింది. కంపెనీ మార్కెట్‌‌ వాటాను కోల్పోతుందా? ఆన్‌‌లైన్ ప్లాట్‌‌ఫామ్స్‌‌ వైపు ఎల్‌‌ఐసీ షిఫ్ట్ అవుతుందా? అని ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు’ అని జీసీఎల్‌‌ సెక్యూరిటీస్‌‌ వైస్ చైర్మన్ రవి సింఘల్‌‌ అన్నారు.  టెక్నికల్‌‌గా చూసినా కంపెనీ షేరు బలహీనంగా ఉందని చెప్పారు.