- ఆర్బిటర్ మ్యాపింగ్‌తో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం
- గ్లోబల్ స్పేస్ నెట్వర్క్ సెన్సర్ల డేటా విశ్లేషణ
మొట్టమొదటిసారి చంద్రుడిపై దిగబోతున్నామని కోట్లాది మంది కన్న కల కనురెప్ప వెనకాలే ఆగిపోయింది. జాబిలిపై దిగిన దేశాల జాబితాలో సగర్వంగా నిలిచే అవకాశాన్ని ఆ టెర్రర్ టైం మింగేసింది. ఇంకాసేపట్లో చేరాల్సిన చోటుకు వెళ్లిపోతామన్న టైంలోనే విక్రమ్‌తో లింక్ కట్టయింది. అయినా, ఇప్పటిదాకా చేసింది తక్కువేం కాదన్న ధీమాతో ఇస్రోకు అండగా నిలిచారు జనం. అసలు విక్రమ్ ఎందుకు ఫెయిలైంది? దిగేటప్పుడు ల్యాండర్‌కు ఏం జరిగి ఉండొచ్చు? క్రాష్‌ల్యాండ్ అయిందా లేదా గతి తప్పి అక్కడే తిరుగుతోందా? ఇవన్నీ ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్నలు. ఆ 15 నిమిషాలు టెర్రర్ అని ఇస్రో చైర్మన్ కే శివన్ ముందు నుంచీ చెబుతున్నారు. విక్రమ్ ల్యాండింగ్ మొదలైనప్పుడు అంతా సాఫీగానే సాగింది. శివన్ చెప్పినట్టు ఆ టెర్రర్ ముందు కనిపించలేదు. రఫ్ బ్రేకింగ్ ఫేజ్, నావిగేషన్ కంట్రోల్ ఫేజ్‌లు సక్సెస్ అయ్యాయి. చివరిదైన ఫైన్ బ్రేకింగ్ ఫేజ్‌లోకి ఎంటరయ్యాక కాసేపు బాగానే నడిచింది. కానీ, 2.1 కిలోమీటర్ల ఎత్తుకు చేరినప్పుడు మొదలైంది శివన్ చెప్పిన ఆ టెర్రర్ టైం. విక్రమ్ గతి తప్పింది. సిగ్నల్ పోయింది.
కూలిపోయిందా?
విక్రమ్ 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు దాని స్పీడ్ దాదాపు గంటకు 6 వేల కిలోమీటర్ల దాకా ఉంది. చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాలంటే దాని స్పీడ్‌ను తగ్గించాలి. అదే చేశారు ఇస్రో సైంటిస్టులు. మూడో ఫేజ్ ల్యాండింగ్‌కు వచ్చే సరికి దాని వేగం గంటకు 300 కిలోమీటర్లకు తగ్గించగలిగారు. అప్పటికి విక్రమ్ అడ్డంగా (హారిజాంటల్) ప్రయాణిస్తోంది. మూడో స్టేజ్‌కు వచ్చాక దానిని నిలువుగా మార్చాలి. అంటే దానిని పిల్లిమొగ్గ వేయించాలి. అంటే నిలువుగా నిలబెట్టేలా తిప్పాలి. దాని కాళ్లను చంద్రుడి వైపు చూపించాలి. అలా అది మారుతున్నప్పుడే వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే రూట్‌కు మారిపోయింది. అక్కడితో దాని సిగ్నళ్లు కట్ అయ్యాయి. అప్పటికి 2.1 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి 300 స్పీడ్‌తో వెళుతున్న విక్రమ్ అదే స్పీడ్‌తో చంద్రుడిపై కూలిపోయి ఉండొచ్చని కొందరు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. దాని వల్ల విక్రమ్‌లోని పరికరాలు పాడైపోయి ఉండొచ్చనుకుంటున్నారు. దాంతో మనకు సిగ్నళ్లు కట్అయిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సరే, గ్రావిటీ తక్కువ కాబట్టి కూలిపోలేదని అనుమానం వచ్చినా, అంత స్పీడ్‌లో ఉన్న ల్యాండర్ ఎంతో కొంత ఇంపాక్ట్‌తో చంద్రుడిని ఢీకొట్టి ఉంటుందన్న వాదనా తీసుకొచ్చారు. లేదూ, అలా కాకపోయి ఉండొచ్చు అనుకుంటే, ఫ్లిప్ అవుతున్న క్రమంలో విక్రమ్‌లోని వ్యవస్థలు పాడైపోయి గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయి ఉండే అవకాశమూ ఉంటుందంటున్నారు.
సరే, అట్ల అనుకున్నా, ఆర్బిటర్‌కు విక్రమ్ నుంచి సంకేతాలు వెళ్లాయని ఇస్రో సైంటిస్టులే చెప్పారు కదా. అలాంటప్పుడు అందులోని వ్యవస్థలు ఫెయిలయ్యాయనీ కచ్చితంగా చెప్పలేమన్న వాదనా వినిపిస్తున్నారు. ఒకవేళ చంద్రుడిపై దిగకుండా అక్కడే తిరుగుతుందనుకున్నా అలా ఎంత సేపు ఉంటుందన్నది అనుమానమే.
గ్రావిటీనే ఇంధనం
నాసా నేరుగా చందమామ దగ్గరికే వెళ్లింది. దానికి కారణం వాళ్లకున్న టెక్నాలజీనే. మన బాహుబలి రాకెట్ జీఎస్ఎల్వీతో పోలిస్తే శాటర్న్ రాకెట్ చాలా శక్తిమంతమైనది. భూకక్ష్యను దాటి నేరుగా చంద్రుడి కక్ష్యలోకి వెళ్లే శక్తి దానికుంది. అయితే, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇస్రో మాత్రం ‘గ్రావిటీ (గురుత్వాకర్షణ)’పైనే ఆధారపడింది. జియోసింక్రనస్ ఆర్బిట్ వరకు చంద్రయాన్2ను జీఎస్ఎల్వీ రాకెట్ మోసుకెళ్లింది. అక్కడి నుంచి గ్రావిటీ స్లింగ్ షాట్ (తిప్పి తిప్పి కక్ష్యను మార్చడం) టెక్నిక్‌తో చంద్రుడి దాకా తీసుకెళ్లింది. ఇది చాలా టైం తీసుకునే వ్యవహారం. ఎందుకంటే, స్పేస్‌క్రాఫ్ట్ గతి తప్పకుండా చూసుకుంటూ సమయానికి తగ్గట్టు దాని కక్ష్యను మార్చాల్సి ఉంటుంది. దాని వల్ల ఇంధనం కూడా ఆదా అవుతుంది. ఖర్చూ తగ్గుతుంది. అందుకే ఇస్రో గ్రావిటీ స్లింగ్ షాట్‌తో చంద్రయాన్ 2 ప్రయోగం చేపట్టింది. ల్యాండర్ విక్రమ్‌ను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేదాకా ఇదే టెక్నిక్‌ను వాడింది. అక్కడిదాకా అంత సక్సెస్‌ఫుల్‌గానే జరిగింది.ల్యాండింగ్ అయ్యేటప్పుడే విక్రమ్ సిగ్నల్ కట్ అయింది.
ఆర్బిటర్పైనే ఆశంతా
విక్రమ్‌కు ఏమైందో తెలుసుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క ఆశ ఆర్బిటర్. అవును, ఇప్పుడు దానిపైనే భారమంతా. ప్రస్తుతం చందమామకు దగ్గర్లోనే అది తిరుగుతోంది. దీంతో ఇస్రో అది ఇచ్చే డేటాపైనే విక్రమ్‌కు ఏం జరిగిందో తెలుసుకోబోతోంది. ఫైనల్ ఎమిషన్స్ (విక్రమ్ వదిలిన ఉద్గారాలు), సెన్సర్లు ఇచ్చిన చివరి డేటా వంటి వాటిని సైంటిస్టులు విశ్లేషించనున్నట్టు తెలుస్తోంది. ఆర్బిటర్‌లోని సెన్సర్లతో చంద్రుడిని స్కాన్ చేయనున్నారు. తద్వారా విక్రమ్ దారి తప్పిందేమో తెలుసుకుంటారు. చంద్రుడి నేలపై క్రాష్ ల్యాండింగ్‌కు సంబంధించిన క్లూల కోసం వెతుకుతారు. అంతేగాకుండా గ్లోబల్ స్పేస్ నెట్వర్క్ నుంచి సెన్సర్ల డేటాను తీసుకుని విక్రమ్ మిస్సింగ్‌కు గల కారణాలేంటో అంచనా వేయనున్నారు.
