స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి ఆనంద్ శర్మ రాజీనామా

స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి ఆనంద్ శర్మ రాజీనామా

బీజేపీతో ఢీ కొట్టి కేంద్రంలో అధికారంలోకి రావాలని ఉత్సహాం చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత లీడర్స్ షాక్ లిస్తున్నారు. పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. ఇటీవలే పలువురు కీలక నేతలు ఇప్పటికే బీజేపీ, ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. తాజాగా... హిమాచల్ ప్రదేశ్ శాఖ స్టీరింగ్ కమిటీ నాయకత్వానికి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. నా ఆత్మగౌరవంతో రాజీపడలేనిది అంటూ రాసుకొచ్చారు. స్టీరింగ్ కమిటీ విధులపై స్పష్టతనివ్వాలని కోరారు. ఎన్నికల సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా తనను విస్మరించారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

కొద్ది రోజుల క్రితం జమ్మూ, కాశ్మీర్ లో ప్రచార కమిటీ, రాజకీయ వ్యవహారాల ప్యానెల్ ఛైర్మన్ పదవికి G23లో సభ్యుల్లో ఒకరైన ఆజాద్ రాజీనామా చేశారు. ఈ ఏడాది చివరిలో హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నాయకుడైన ఆనంద్ శర్మ.. ఏప్రిల్ 26వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ గా నియమితులయ్యారు. జి23 గ్రూపులో శర్మ సభ్యుడు. 1982లో  అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేశారు. 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు రాజ్యసభ సీటు కల్పించారు. పార్టీలో అనేక కీలక పదవులు చేపట్టారు.