కరోనా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సంచలన ప్రకటన

కరోనా ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సంచలన ప్రకటన

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారికి లక్షల సంఖ్యలో జనం బలైపోయారు. మన దేశంలో కూడా వేల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.
ఎలాంటి వైద్యం అందించిన కొందరు మాత్రం వైరస్ దెబ్బకు బతికి బట్టకట్టలేకపోయారు. అలాంటి సమయంలో... కరోనా బీభత్సం సృష్టిస్తున్న వేళ... ప్రాణాలపై కొత్త ఆశ కలిగించేలా చేశారు నెల్లూరు జిల్లాకు కృష్ణ పట్నంకు చెందిన బొనిగి ఆనందయ్య కరోనాకు ఆయుర్వేద మందును కనుగొన్నాడు. 

వ్యాక్సిన్లు, మందులు, ఆక్సిజన్, చికిత్స కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నా కట్టడి కాని వైరస్‌ను కేవలం ఆకులు, వివిధ రకాల వంటింటి దినుసులతో రూపొందించిన ఆయుర్వేద మందులతో నియంత్రిస్తున్నట్లు జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో బాధితులు ఆనందయ్య మందు కోసం బారులు తీరారు. కృష్ణపట్నంకు ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, తెలంగాణ, పెద్ద సంఖ్యలో వాహనాలు, అంబులెన్స్ లు క్యూ కట్టాయి. ఒక్కసారిగా ఆనందయ్య ఆయుర్వేద మందు పాపులర్ అయిపోయింది. ప్రభుత్వం సైతం ఆనందయ్య మందుపై దృష్టి పెట్టి టెస్టులు చేయించింది.  

అయితే కరోనా వైరస్‌కు మందు పంపిణీతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తాజాగా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే తాను రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు తెలిపారు.ఏపీ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు కూడా అయిన ఆనందయ్య నిన్న విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలోని నూకాలమయ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీసీ జేఏసీని కలుపుకుని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కొత్త వేరియంట్‌తో భయపడుతున్న వేళ.. తన వద్ద దీనికి కూడా మందు ఉందని, ప్రభుత్వం కనుక సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు.