వర్షాలకు కొట్టుకుపోయిన అందవెల్లి పెద్ద వాగు బ్రిడ్జ్.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్

వర్షాలకు కొట్టుకుపోయిన అందవెల్లి పెద్ద వాగు బ్రిడ్జ్.. 42 గ్రామాలకు రాకపోకలు బంద్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన మరోసారి కొట్టుకుపోయింది. దహెగాం నుంచి కాగజ్ నగర్ వెళ్లేందుకు ప్రజల కోసం తాత్కాలిక బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జి్ని సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభిచేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సెప్టెంబర్ 2వ తేదీన కొమురం భీం జిల్లాలో బీభత్సమైన వర్షాలు పడటంతో వాగులో వరద ఉదృతి పెరగింది. దీంతో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. 

అందవెల్లి పెద్దవాగులో దహెగాం మండలం, కాగజ్ నగర్ మండలం మధ్య రాకపోకలకు తాత్కాలిక వంతెన నిర్మించారు.  సిమెంట్‌ పైపులు వేసి.. పైనుంచి నాలుగు అడుగుల మందంతో మొరం పోశారు. తాత్కాలిక వంతెన పనులకు దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేశారు.  భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం హెచ్చరిచింది. అయితే ఈసారి అన్ని జాగ్రత్తలు  తీసుకొని తాత్కాలిక బ్రిడ్జి్ నిర్మించినా.. ప్రారంభానికి ముందే కొట్టుకుపోవడం గమనార్హం. 

అందవెల్లి పెద్దవాగుపై  శాశ్వత బ్రిడ్జి్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే వర్షాల కారణంగా ఈ పనులకు ఆటంకం కలుగుతోంది. అయితే దహెగాం, కాగజ్ నగర్ మండలాల మధ్య రాకపోకలు సాగించేందుకు కాంట్రాక్టర్లు మొరంతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఈ వంతెన కూడా కొట్టుకుపోవడంతో కాగజ్‌నగర్‌, దహెగాం, కన్నెపల్లి మండలాల్లోని 42  గ్రామాల ప్రజలకు వాగు దాటాలంటే అవస్థలు పడాల్సిందే.