
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ 2030 నాటికి ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారీ పెట్టుబడులు అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
రాష్ట్ర విధానాల ప్రయోజనాలను ఉపయోగించుకోవాలని పెట్టుబడిదారులను ఆయన కోరారు. 2023 జనవరిలో కేంద్రం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ రూ.19,744 కోట్లతో ఆమోదించింది. 2030 నాటికి 5 ఎంఎంటీ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ భారత గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్‌కు కేంద్రంగా మారుతోందని, 2030 నాటికి ఒక ఎంఎంటీ (దేశ ఉత్పత్తిలో 20శాతం) లక్ష్యంగా పెట్టుకుందని అమరావతిలో జరిగిన కార్యక్రమంలో చంద్రశేఖర్ చెప్పారు.
ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నంలోని పూడిమడకలో రోజుకి 1,500 టన్నుల కెపాసిటీ గల గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను, రోజుకి 7,500 టన్నుల కెపాసిటీ గల డెరివేటివ్‌ల (గ్రీన్ అమ్మోనియా, మిథనాల్) హబ్‌ను అభివృద్ధి చేస్తోంది. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోకి రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని అంచనా.