
ఏపీలో అంగన్ వాడీలు తమ డిమాండ్ లను నెరవేర్చాలంటూ పిలుపునిచ్చిన చలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి విజయవాడ అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన అంగన్ వాడీలను పోలసులు ఎక్కడిక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. కొందరిని ముందస్తుగానే అరెస్ట్ చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో అంగన్ వాడీలు రోడ్లపైనే నిరసన తెలుపుతున్నారు. ఏలూరులో అంగన్ వాడీలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో 2 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పల్నాడులో సత్తెనపల్లిలో చెన్నకేశవ స్వామి ఆలయం ముందు నిరసన తెలిపారు అంగన్ వాడీలు.
అంగన్ వాడీలకు మద్దతు తెలిపిన పలు పార్టీలు, సంఘాల నేతలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంగన్ వాడీలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్న తమను ఈవిధంగా అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. పోలీసుల వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.