అద్దె భవనాల్లోనే.. అంగన్​వాడీలు..!

అద్దె భవనాల్లోనే.. అంగన్​వాడీలు..!
  • ప్రభుత్వ స్కూళ్లలోకి కేంద్రాల తరలింపు ఇంకెప్పుడు?
  • అద్దె భారం మోయలేకపోతున్న టీచర్లు
  • గతేడాదే మార్చుతామన్న రాష్ట్ర సర్కార్​

భద్రాచలం, వెలుగు : గ్రామాలు, పట్టణాల్లో ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు అద్దె భవనాలే దిక్కవుతున్నాయి. జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం అద్దె భవనాల్లో కొనసాగుతున్న సెంటర్స్​ను సమీప ప్రభుత్వ స్కూళ్లలోకి మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాదే చెప్పింది. అయితే అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటికీ రాలేదు. దీంతో అంగన్​వాడీ కేంద్రాలను సమీప ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలోకి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయం అమలు కాలేదు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్​ను ప్రైమరీ ఎడ్యుకేషన్​కు అనుసంధానం చేసి బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారమే కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు రాష్ట్ర విద్యాశాఖకు చేరుతాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు కేంద్రం 60శాతం వాటా నిధులను నిర్వహణకు రాష్ట్రానికి అందిస్తోంది. ఈ నిధులు రావాలంటే తప్పనిసరిగా జాతీయ నూతన విద్యావిధానం అమలు చేసి తీరాలి. లేదంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయి. ఈ ప్రక్రియ గతేడాదే పూర్తి కావాల్సి ఉంది. అయితే దీనిపై విద్యాశాఖాధికారులకే క్లారిటీ లేదు. ప్రస్తుతం జిల్లాలో1434 ప్రధాన, 628 మినీ అంగన్​వాడీ సెంటర్లు ఉన్నాయి. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే అంగన్​వాడీ కేంద్రాల కష్టాలు గట్టెక్కుతాయని నిర్వాహకులు భావించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలిస్తే అద్దె భారం తప్పుతుందని ఆశపడ్డ అంగన్​వాడీ టీచర్లకు భంగపాటే ఎదురైంది. ఫలితంగా జాతీయ నూతన విద్యావిధానానికి రాష్ట్ర సర్కారు గండిపెట్టినట్లయింది.

పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం..

జాతీయ నూతన విద్యావిధానం అమలైతే పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది. అదే సమయంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్​వాడీ కేంద్రాలు సర్కారు స్కూళ్ల భవనాల్లోకి తరలిస్తే అద్దె భారం తప్పుతుందని టీచర్లు భావించారు. దాదాపు 70శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. జిల్లాలో 512 అంగన్​వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 771 కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటిలో గ్రామాల్లో 750 కేంద్రాలు, పట్టణాల్లో మరో 21 కేంద్రాలున్నాయి. పల్లెల్లో ఉన్నవాటికి రూ.వెయ్యి, పట్టణాల్లోని కేంద్రాలకు రూ.3వేలు చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. ఒక్కో గదికే రూ.15వందలు అద్దె కట్టాల్సి వస్తోందని, దీంతో ఒక్కో అంగన్​వాడీ టీచర్​పై రూ.1000ల నుంచి రూ.2వేల వరకు అదనపు భారం పడుతోందని వారు వాపోతున్నారు. 

 ప్రభుత్వం అద్దె పెంచాలి...

అంగన్​వాడీ సెంటర్లకు ఇచ్చే అద్దె సరిపోవడంలేదు. భవనాలు లేక అద్దెకు తీసుకుంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే అద్దె డబ్బులు ఎటూ సరిపోవడం లేదు. టీచర్లు చేతి నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తోంది. సర్కారు బడిలో కలిపే ప్రతిపాదన కూడా నేటికీ ఏమీ జరగలేదు. 
జిలుకర పద్మ, అంగన్​వాడీ టీచర్స్ అసోషియేషన్​జిల్లా కార్యదర్శి

ఇప్పటికైతే క్లారిటీ లేదు...

జాతీయ నూతన విద్యావిధానం విషయంలో సరైన క్లారిటీ ఇంకా రాలేదు. ప్రైమరీ స్కూళ్లలోకి అంగన్​వాడీ కేంద్రాలను తరలించేందుకు గతంలో సన్నాహాలు చేశాం. ఇప్పటివరకైతే ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నాం.

–సమ్మయ్య, ఎంఈవో, భద్రాచలం