ప్రకృతి ఒడే ఆమె కొడుక్కి బడి

ప్రకృతి ఒడే ఆమె కొడుక్కి బడి

స్కూల్​, ట్యూషన్​, ర్యాంకుల్లో పడి తన కొడుకు అందమైన బాల్యాన్ని కోల్పోకూడదు అనుకుందామె. అందుకే కొడుకుని స్కూల్​ మాన్పించింది. చెట్టు– చేమలని  స్నేహితుల్ని చేసింది. వివిధ ప్రాంతాలు తిప్పుతూ అక్కడి కల్చర్​నే పాఠాలుగా చెప్తోంది. ‘జీవితానికి సంబంధించిన అన్ని  పాఠాలు క్లాస్​ రూమ్​లో నేర్చుకోలేం’ అంటున్న ఆమె పేరు అనికా సోన్వాణే.  తన ఆరున్నరేండ్ల కొడుకు ప్రన్ష్ తో కలిసి ఆమె చేస్తున్న జర్నీ గురించి..

పుణేకి చెందిన అనిక, భర్త అమోల్​ ఇద్దరూ ఐటీ ఉద్యోగులు​. లక్షల్లో సంపాదన, బంగారం లాంటి కొడుకు. అంతా హ్యాపీనే. కానీ, లాక్​డౌన్​ టైమ్​లో తన కొడుకు ప్రవర్తనలో తేడా గమనించింది అనిక. ఆన్​లైన్​ క్లాసులంటే చిరాకు పడటం, ఎప్పుడూ దిగులుగా కూర్చోవడం, ఎవరితోనూ మాట్లాడకపోవడం చూసి, కంగారు పడింది. ఎందుకిలా ఉన్నాడని కొడుకుని గమనించింది. నాలుగ్గోడల మధ్య ఆన్​లైన్​ క్లాసులతో నలిగిపోతున్నాడనే విషయం అర్థమైంది ఆమెకు. భర్త, అత్తమామలకి ఇష్టం లేకపోయినా కొడుకుని ఎల్​కేజీతోనే స్కూల్​ మాన్పించేసింది. తనూ ఉద్యోగానికి రిజైన్​ చేసి..పోయిన ఏడాది ఏప్రిల్​లో ఐదేండ్ల కొడుకుతో ఈ  ప్రకృతి ప్రయాణం మొదలుపెట్టింది. 

ఆ ఇంట్రెస్ట్​ చూసి... 

ఈ జర్నీలో మొదటిగా హిమాచల్​ప్రదేశ్​ వెళ్లారు ఈ తల్లీకొడుకులు.  ప్రకృతికి దగ్గరగా వెళ్లినప్పుడు కొడుకు చాలా సంతోషంగా ఉండటం గమనించింది అనిక. ‘యాపిల్​, బెర్రీ ఎలా పండుతాయి? రైతులు వాటిని పండించడానికి ఎంత కష్టపడుతున్నారు? ఎలా అమ్ముతున్నారు?’ లాంటి విషయాలు  తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్​ చూపించేవాడు ప్రన్ష్​​. పైగా అక్కడి వాళ్లతో బాగా కలిసిపోయేవాడు. అవన్నీ చూశాక తాను తీసుకున్న నిర్ణయం సరైంది అనిపించింది ఆమెకి. కొడుకులో వస్తున్న మార్పుల్ని గమనించిన అనిక భర్త కూడా ఆమెని ప్రోత్సహించాడు. అత్తమామలు అండగా నిలిచారు. దాంతో కొడుకుతో కలిసి దేశం మొత్తం తిరగాలని నిర్ణయించుకుందామె. అలా ఇప్పటివరకు బీహార్​, లఢఖ్​ , హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్​, మహారాష్ట్ర.. ఇలా చాలా ప్రదేశాలు వెళ్లారు. 

అయితే ఎక్కడికెళ్లినా హోటల్స్​లో మాత్రం ఉండేది కాదు అనిక. పది, పదిహేను రోజులకు ఇండ్లని అద్దెకు తీసుకుంటుంది. దీనివల్ల కొడుకు అక్కడి  జనాలకి కనెక్ట్​ అవుతాడన్నది ఆమె ఆలోచన. అలాగే అక్కడి ఫెస్టివల్స్​లోనూ అతను పాల్గొనేలా చేస్తుంది. దగ్గర్లో ఉండే కొండలు, గుంటలు ఎక్కిస్తుంది. సముద్రాన్ని దగ్గర్నించి చూపిస్తుంది. దీనివల్ల తన కొడుకు జియోగ్రఫీ తెలుసుకుంటున్నాడని చెప్తుంది. ‘ఇంతకుముందు ప్రన్ష్​​ టెక్స్ట్​​బుక్స్​​లో ఉన్న  ఫ్రూట్స్​ ​ గురించి తెలుసుకోవడానికి గూగుల్​లో వెతికేవాళ్లం. కానీ, ఈ జర్నీ వల్ల నా కొడుకు  పండ్ల గురించే కాదు.. ఆ చెట్ల చరిత్ర కూడా చెప్తున్నా’డు అంటూ సంతోషంగా చెప్పింది. 

‘‘ప్రన్ష్​​ని స్కూల్​ మాన్పించాలి అనుకున్నప్పుడు ఇంట్లో వాళ్లు వద్దన్నారు. కానీ, నా కొడుకు ఫ్యూచర్​ గురించి ఆలోచిస్తే..ఆ నిర్ణయం తప్పనిసరి అనిపించింది. మొదట్లో నేను ఇలా ఎందుకు చేస్తున్నాను?  ఎక్కడైనా, ఏదైనా జరిగితే అని చాలా భయపడేదాన్ని. కానీ, వాడిలో  వస్తున్న మార్పు నన్ను వెనకడుగు వేయనీయలేదు. తన స్కూల్​ ఫీజులకయ్యే ఖర్చుతోనే ట్రావెలింగ్ చేస్తున్నా. ఫ్యూచర్​లో కావాలంటే ఓపెన్​ స్కూల్​కి పంపిస్తా. అయితే తను డెసిషన్స్​ తీసుకోగలిగే స్టేజ్​కి  వచ్చిన ప్పుడు.. స్కూల్​కి​ వెళ్లాలనుకుంటే మాత్రం నేను అడ్డు చెప్పను’’ అంటోంది అనిక.