17 వేల కోట్లు ఎగ్గొట్టిన అనిల్ అంబానీ: విచారిస్తున్న ఈడీ.. ప్లాన్ ప్రకారమే లోన్స్..

17 వేల కోట్లు ఎగ్గొట్టిన అనిల్ అంబానీ: విచారిస్తున్న ఈడీ.. ప్లాన్ ప్రకారమే లోన్స్..

 రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ నేడు న్యూఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరయ్యారు. ప్రస్తుతం అనిల్ అంబానీ కంపెనీలకు సంబంధించిన బ్యాంకుల రుణల మోసాలకు సంబంధించి మనీలాండరింగ్ కేసును కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది.ఉదయం 11 గంటల సమయంలో ED ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఈడీ దాడులు: జూలై 24న ED పెద్ద ఎత్తున దాడులు చేసిన తర్వాత చాల ప్రశ్నలు తలెత్తాయి. ఈ దాడులు 50 కంపెనీలకు సంబంధించిన 35 ప్రదేశాలలో అలాగే  రిలయన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా 25 మందిపై జరిగాయి. ఈ సోదాలు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్‌ఫ్రా) వంటి గ్రూప్ సంస్థలు రూ.17,000 కోట్లకు పైగా లోన్ మళ్లింపుకు సంబంధించిన ఆర్థిక అవకతవకలకు సంబంధించినవి. 2017 నుండి 2019 మధ్యకాలంలో యెస్ బ్యాంక్ నుండి రిలయన్స్ గ్రూప్ కంపెనీలు రూ.3,000 కోట్ల లోన్లని  దుర్వినియోగం చేశాయని   ఆరోపణలు ఉన్నాయి.

సమాచారం ప్రకారం యెస్ బ్యాంక్ సరైన చెకింగ్ లేదా వెరిఫికేషన్ లేకుండానే లోన్స్  సాంక్షన్ చేసింది. లోన్స్ ఆమోదించే ముందు సంబంధిత కంపెనీల ద్వారా లంచాలు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న సంస్థలకు, నకిలీ అడ్రసులు లేదా జాయింట్ డైరెక్టర్లు ఉన్న కంపెనీలకు కూడా లోన్స్ ఇచ్చారని, ఇది షెల్ కంపెనీలు అని తెలుస్తుందని విచారణలో తేలింది.

►ALSO READ | అమెరికా వీసా అప్లయ్ చేస్తున్నారా.. కండిషన్స్ అప్లయ్: ఇక 13 లక్షల బాండ్ కట్టాల్సిందే..

 SEBI, CBI, NHB రిపోర్ట్స్ : ED కేసుకు SEBI, CBI, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇతరుల రిపోర్ట్స్  కూడా తోడవుతున్నాయి. దీని బట్టి చూస్తే బ్యాంకులు, పెట్టుబడిదారులు సంస్థలను మోసం చేయడం ద్వారా ప్రజా ధనాన్ని దోచేయడానికే ముందే ఒక పెద్ద ప్లాన్ వేసినట్లు  తెలుస్తుంది. ఒక కేసులో ఆర్ ఇన్‌ఫ్రా, ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు (ICDలు)గా చెప్పుకుంటూ ఇతర గ్రూప్ సంస్థలకు CLE అనే కంపెనీ ద్వారా డబ్బును పంపినట్లు బయటపడింది. 

రిలయన్స్ గ్రూప్ ప్రతినిధి ఈ విషయాన్నీ కొట్టిపారేశారు. రూ. 10,000 కోట్ల మళ్లింపు అనేది 10 సంవత్సరాల కిందటి వ్యవహారమని, రూ. 6,500 కోట్లు ఇప్పుడు కోర్టు ద్వారా రికవరీ అయినట్లు, మార్చి 2022 నుండి అనిల్ అంబానీ ఆర్ ఇన్‌ఫ్రా బోర్డులో లేరని చెప్పారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCOM) రూ.1,050 కోట్ల కెనరా బ్యాంక్ మోసం కేసును కూడా ED పరిశీలిస్తోంది.