
అనిల్ అంబానీపై ఈడీ సంస్థ తన దూకుడును రోజురోజుకూ పెంచేస్తోంది. తాజాగా ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అషోక్ పాల్ ను అరెస్ట్ చేయటం వ్యాపార వర్గాల్లో కలకలానికి కారణంగా మారిపోయింది. అయితే అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో జరిగిన మనీలాండరింగ్ వ్యవహారంలో అషోక్ పాత్ర ఉండటం వల్లనే ఆయనను ప్రస్తుతం ఈడీ అరెస్ట్ చేసినట్లు వెల్లడైంది.
అనేక గంటలు ప్రశ్నించిన తర్వాత ఈడీ అధికారులు పాల్ ను ఢిల్లీలో నిన్న రాత్రి కస్టడీలోకి తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం ఆయనను స్పెషల్ కోర్టు ముందు ఈడీ హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన నుంచి మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు కస్టడీకోసం అడగొచ్చని సమాచారం.
వాస్తవానికి అషోక్ పాల్ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీకి చెందిన డబ్బును దారిమళ్లించటంలో కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తన స్టేట్మెంట్లో వెల్లడించింది. సెకీకి సమర్పించిన రిలయన్స్ పవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ టెండర్లకు సంబంధించిన పత్రాలు ఫైనలైజ్ చేయటం నుంచి వాటిపై సంతకం వరకు అవసరమైన పవర్స్ బోర్డు తీర్మానం నుంచి అషోక్ అందుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇదే క్రమంలో కంపెనీలోని కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ కి కూడా దీనికి సంబంధించిన పవర్స్ అందాయని ఏజెన్సీ గుర్తించింది.
అందువల్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ)కి అందించిన రూ.68 కోట్ల బోగస్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించటంలో పాల్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. నకిలీ హామీని జారీ చేయడానికి పాల్ ఒడిశాకు చెందిన బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ (BTPL) ను ఎంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నకిలీ బ్యాంక్ గ్యారెంటీల రాకెట్ sbi.co.in కు బదులుగా s-bi.co.in వంటి అసలైన భారతీయ బ్యాంకుల మాదిరిగానే కనిపించే డొమైన్‌ల ద్వారా చట్టబద్ధమైన కమ్యూనికేషన్‌లను ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది.
అలాగే కోట్ల రూపాయలకు విలువైన నకిలీ ట్రాన్స్ పోర్ట్ ఇన్‌వాయిస్‌ల ద్వారా నిధులను మళ్లించడంలో పాల్ కీలక పాత్ర పోషించాడని తేలింది. 75 శాతం కంటే ఎక్కువ వాటాలను ప్రజలు హోల్డ్ చేస్తున్న పబ్లిక్-లిస్టెడ్ కంపెనీ ద్వారా జరిగిన ఈ మోసం "ప్రజా ప్రయోజనాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని ఏజెన్సీ వెల్లడించింది. నిందితుడు ఈ ఫేక్ వ్యవహారం మెుత్తాన్ని నడిపించటానికి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించినట్లు గుర్తించబడింది.