అనిల్ అంబానీ కంపెనీకి ఫ్రాన్స్ లో టాక్స్ రాయితీ?

అనిల్ అంబానీ కంపెనీకి ఫ్రాన్స్ లో టాక్స్ రాయితీ?

రాఫెల్‌ యుద్ధ విమానాల కాంట్రాక్టును అక్రమంగా దక్కించుకుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్‌ అంబానీకి చెందిన ఫ్రెంచ్‌ కంపెనీ మరోసారి వివాదంలో చిక్కుకుంది.‘రిలయన్స్‌ అట్లాంటిక్ ఫ్లాగ్‌ ఫ్రాన్స్  కంపెనీకి అక్రమంగా 143.7 (దాదాపు రూ.1,124 కోట్లు) మిలియన్‌‌‌‌ యూరోల మేరకు పన్ను మినహాయింపులు ఇచ్చారని ఫ్రెంచ్‌ వార్తాపత్రిక లీ మోండే ఒక కథనాన్ని ప్రకటించింది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్‌ తో ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని నెలలకే పన్ను మొత్తంలో భారీగా రాయితీ ఇచ్చారని వెల్లడించింది. ఈపత్రిక కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి .

మొదట తిరస్కరణ……

2007–2010 మధ్య కా లానికి రిలయన్స్‌ అట్లాంటిక్ ‌‌‌ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌ కంపెనీ 60 మిలియన్‌‌‌‌ యూరోల(దాదాపు రూ.469 కోట్లు) పన్ను చెల్లించాలని స్థానిక అధికారులు నిర్ణయించారు. తాము అంత కట్టలేమని, 7.6 మిలియన్ యూరోలు అయితే భరించగలమని ఈ కంపెనీ విన్నవించుకోగా, అధికారులు తిరస్కరించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా, పన్ను విలువ 91 మిలియన్‌‌‌‌ యూరోలు (దాదాపు రూ.712కోట్లు) ఉంటుందని తేల్చారు. 2015లో ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు వచ్చినప్పుడు రాఫెల్‌ విమానాల ఒప్పందంపై హఠాత్తుగా ప్రకటన చేశారు. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 36 విమానాలు కొంటున్నట్టు వెల్లడించారు. ఈ డీల్​ ప్రభావమో మరేదో కానీ మళ్లీ రిలయన్స్‌ కంపెనీ చెల్లించాల్సిన పన్ను మొత్తంలో ఊహించనంత రాయితీ ఇచ్చారు. అసలైతే అప్పటికి పన్ను మొత్తం 151 మిలియన్ యూరోలకు చేరింది. అయితే, ప్రధాని పర్యటన ముగిసిన ఆరు నెలలకు పన్ను చెల్లింపుపై తుది ఒప్పందం కుదిరింది. రిలయన్స్‌ చెల్లించాల్సిన151 మిలియన్‌‌‌‌ యూరోలకు బదులు 7.3 మిలియన్‌‌‌‌ యూరోలే చెల్లించింది. అంటే 143.7 మిలియన్‌‌‌‌ యూరోల మేరకు రాయితీ ఇచ్చారు. మరుసటి ఏడాది 2016లో ఇండియా, ఫ్రాన్స్‌ 7.87 బిలియన్ యూరోల విలువైన ఇంటర్‌ గవర్నమెంటల్‌ అగ్రిమెంట్‌ పై సంతకాలు చేశాయి. ఇందులో ఫ్రెంచ్‌ భాగస్వాములకు50 శాతం ఆఫ్‌ సెట్‌ క్లాజ్‌ కూడా ఉంది.రాఫెల్‌ జెట్స్ తయారీ కంపెనీ డసో ఏవియేషన్‌‌‌‌,ఆఫ్‌ సెట్‌ పార్ట్‌‌‌నర్‌ గా రిలయన్స్‌ అట్లాంటిక్‌‌‌ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌ను ఎంచుకుంది. రక్షణరంగంలో ఏమాత్రం అనుభవం లేని కంపెనీకి ఈ కాంట్రాక్టును అప్పగించడంపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. ఈ విషయమై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాం కోయిస్‌‌‌‌ హోలాండే మాట్లాడుతూ ఆఫ్‌ సెట్‌ పార్ట్‌‌‌‌నర్‌ విషయంలో తమకు మరో చాయిస్ లేదని, రిలయన్స్‌నే తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ వ్యవహారంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌‌‌‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై జులైన్‌‌‌‌ బోయిసో అనే జర్నలిస్టు కూడా వరుసగా ట్వీట్లు చేశారు. 2015 ఏప్రిల్‌ అక్టోబరు మధ్య ఫ్రాన్స్‌ , ఇండియా రాఫెల్‌ చర్చల్లో మునిగి ఉండగా, రిలయన్స్‌ అట్లాంటింక్‌‌‌ ఫ్లాగ్‌ ఫ్రాన్స్‌ కంపెనీకు 143.7 మిలియన్‌‌‌‌ యూరోల విలువ పన్ను మినహాయింపు దొరికిందని ఆయన ఆరోపించారు.