Anil Ravipudi: ‘అంతా దాచిపెడుతున్నారు’.. ‘జన నాయగన్’ రీమేక్ రూమర్స్‌పై అనిల్ సంచలన వ్యాఖ్యలు

Anil Ravipudi: ‘అంతా దాచిపెడుతున్నారు’.. ‘జన నాయగన్’ రీమేక్ రూమర్స్‌పై అనిల్ సంచలన వ్యాఖ్యలు

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). హెచ్. వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సినిమా 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విజయ్ చివరి సినిమా కావడంతో, ఫ్యాన్స్ మరియు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సినిమా ప్రారంభమైనప్పటి నుండి ‘జన నాయగన్’ రీమేక్ ఫిల్మ్’ అనే రూమర్స్ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది.

అయితే, ఈ విషయంపై ఆడియన్స్‌కు మాత్రం ఇంకా స్పష్టత రావట్లేదు. ఈ నేపథ్యంలో.. ‘భగవంత్ కేసరి’ డైరెక్టర్ అనిల్ రావిపూడిని మీడియా ప్రశ్నించింది. మన శంకర్ వరప్రసాద్ ప్రొమోషన్స్‌లో భాగంగా మీడియా ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, అనిల్ రావిపూడి ‘జన నాయగన్’ రీమేక్ గురించి చాలా తెలివిగా బదులిచ్చారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "నిజానికి, వాళ్లు కూడా చాలా విషయాలను దాచిపెట్టి చెప్పుతున్నారు. కొంతమంది దీనిని రీమేక్ అని చెబుతున్నారు, మరికొంతమంది కాదు అంటున్నారు. కానీ, ఒక డైరెక్టర్గా సినిమా విడుదలకు ముందే నేను చెప్పలేను. ఇది దళపతి విజయ్ గారి సినిమా అని ఆ డైరెక్టర్ H వినోద్ గారు కూడా చెప్పారు. కాబట్టి, రిలీజ్ అయ్యే వరకు ‘రీమేక్’ అని చెప్పడం కాకుండా, సినిమాలో వారు ఏం చూపించారు అనేది రిజల్ట్ తర్వాత చూస్తే అర్థం అవుతుంది. అప్పటివరకు అది దళపతి విజయ్ ఫిల్మ్ అంతే. వేరే సినిమాతో పోల్చి చూడొద్దు" అని అనిల్ అన్నారు. 

అలాగే విజయ్ గురించి చెబుతూ.. "‘వారిసు’ షూటింగ్ సమయంలో నేను విజయ్ గారిని రెండు సార్లు కలిసాను. ఆయన నిజంగా సూపర్బ్ జెంటిల్‌మెన్. ఇది ఆయన పొలిటికల్ ఎంట్రీ ముందు నటిస్తున్న లాస్ట్ ఫిల్మ్. ఆ సినిమాలో నా పాత్ర ఉందా లేదా అనేది, జనవరి 9న సినిమా రిలీజ్ అయిన తర్వాతే కచ్చితంగా తెలుస్తుంది" అని డైరెక్టర్ అనిల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరోవైపు ‘జన నాయగన్’ దర్శకుడు హెచ్. వినోద్ కూడా రీమేక్ వార్తలపై మౌనం వీడారు. ఆయన మాట్లాడుతూ,"ఇది నూటికి నూరు శాతం దళపతి విజయ్ సినిమా. కొంతమంది దీనిని రీమేక్ అని అంటున్నారు, మళ్లీ అదే కథను ఎందుకు చూడాలి అని అనుకుంటున్నారు. అలాంటి వారికి నేను ఒకటే చెబుతున్నాను – ఫస్టాఫ్ కంప్లీట్ అయ్యేలోపు వేచి చూడండి. మీకే సమాధానం దొరుకుతుంది. ఇది పూర్తిగా రీమేక్‌నా, లేక కొన్ని సన్నివేశాలకు మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నామా అనే విషయంలో అభిమానులు ఎలాంటి ఆందోళన అవసరం లేదు" అని హెచ్. వినోద్ ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల పొలిటికల్ పార్టీ పెట్టిన విజయ్‌‌‌‌కు ఇదే చివరి మూవీ అని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతుండగా, దీనిపై ఆయన అధికారికంగా ప్రకటించారు. సినిమాలకు గుడ్ బై చెప్పడం ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తి స్థాయిలో సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఎమోషనల్ అయ్యారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌గా రూపొందిన జననాయకుడు చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌‌‌‌గా నటించగా, బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.