- ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు వినూత్న నిరసన
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కుక్కలు, కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఎదుట పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడారు.
ప్రభుత్వాధినేతలు, సుప్రీంకోర్టు మూగజీవాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే, తెలంగాణలో కుక్కలు, కోతులను చంపేస్తున్నారని ఆరోపించారు. వెయ్యికిపైగా కుక్కలు, వందకుపైగా కోతులను దారుణంగా హత్య చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పాలనా వైఫల్యం, మానవీయ విలువల క్షీణతకు నిదర్శనమని విమర్శించారు.
హత్యలు చేయడం కాదు.. శాస్త్రీయ పరిష్కారాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, నివాస రక్షణే సరైన మార్గమని స్పష్టం చేశారు. పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు మూగజీవులపై హింస కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు సమాజాన్ని నైతికంగా వెనక్కి నెట్టేస్తాయని... వెంటనే జంతువుల హత్యలు నిలిపివేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
