ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: తిరుమల కొండపై 2003లో టీటీడీ కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయ విగ్రహాన్ని తిరిగి నిర్మించాలని అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షుడు విజయశంకర్ ​స్వామీజీ డిమాండ్​ చేశారు. అక్టోబరు 5న ఏపీలోని అంతర్వేది నుంచి ప్రారంభించిన చైతన్య రథయాత్ర మంగళవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేకరించిన 11.50 లక్షల సంతకాలతో కూడిన పుస్తకాన్ని భద్రాద్రి రాముడి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య గృహసాధన సమితి, జై భారత్​ స్థల ఆధ్వర్యంలో ఈ చైతన్య రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాన్ని గ్రామ గ్రామాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో యాత్ర చేస్తున్నామని చెప్పారు. అన్నమయ్య గృహాన్ని, ఆంజనేయస్వామి విగ్రహాలను ప్రతిష్టించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. జాతీయ కార్యదర్శి గోల సత్యనారాయణ, గుండు వెంకన్న, ఇమ్మయ్య, రాఘవదాస్, కన్నయ్య పాల్గొన్నారు.

దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్​ రిలీజ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దొడ్డి కొమరయ్య సినిమా పోస్టర్​ను సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్, ఆవాజ్​ జిల్లా సహాయ కార్యదర్శి జలాల్​లతో కలిసి చిత్ర దర్శకుడు సేనాపతి మంగళవారం రిలీజ్​ చేశారు. యూటీఎఫ్​ భవన్​లో పోస్టర్  రిలీజ్​ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ సినిమా అంటే సమాజాన్ని చైతన్య పరిచేలా ఉండాలని అన్నారు. ప్రజా సంఘాల నాయకులు వాసు, శ్రీనివాస్, వెంకన్న, సత్యం, సమ్మయ్య, ఆర్​ శ్రీనివాస్, రవి, పోతు పురుషోత్తం, దర్శకుడు పోగుల దుర్గాప్రసాద్, నటులు బట్టు రవి, జి వెంకట సత్యనారాయణ, ఎస్​ కృష్ణంరాజు, రాధాకృష్ణ, సంపత్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.  

బయోమెట్రిక్  అమలు చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: హాస్టళ్లలో బయోమెట్రిక్  అమలు చేయాలని ఖమ్మం కలెక్టర్  వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్  ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ప్రతినిధులతో బయోమెట్రిక్  హాజరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్  ప్రవేశ పెట్టినట్లు చెప్పారు. 32 పీహెచ్​సీల్లో బయోమెట్రిక్  పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డీఈవో ఎస్  యాదయ్య, జిల్లా దళిత అభివృద్ధి అధికారి సత్యనారాయణ, డీటీడబ్ల్యూవో కృష్ణా నాయక్, బీసీ వెల్ఫేర్​ ఆఫీసర్  జ్యోతి,  డీఐఈవో రవిబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్, అభిషేక్, పవన్ కుమార్, భానుతేజ, ప్రహ్లాద్  పాల్గొన్నారు.

దళితలు వ్యాపారవేత్తలు కావాలి

మధిర,(చింతకాని)వెలుగు: దళితులు వ్యాపారవేత్తలు కావాలని కలెక్టర్  వీపీ గౌతమ్​ సూచించారు. మంగళవారం మండలంలోని  మత్కేపల్లినామవరం, తిరుమలపురం, తిమ్మినేనిపాలెం గ్రామాల్లో యూనిట్లను అడిషనల్ కలెక్టర్ స్నేహతో కలిసి పరిశీలించారు. యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. 

గ్రాండ్​గా వీరేంద్ర చౌదరి బర్త్​డే

ఖమ్మం టౌన్, వెలుగు: త్రివేణి విద్యా సంస్థల అధినేత డాక్టర్  వీరేంద్ర చౌదరి జన్మదినాన్ని మంగళవారం స్కూల్ లో జరుపుకున్నారు. ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్  స్టూడెంట్స్ తో కలిసి కేక్  కట్ చేశారు. స్టూడెంట్స్ కు స్వీట్స్​ పంచారు. త్రివేణి, కృష్ణవేణి స్కూల్స్​ అధిపతి వై వెంకటేశ్వరరావు, సీఆర్వో మురళీకృష్ణ, కిడ్స్ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, అకడమిక్ ఇన్​చార్జ్ ముస్తఫా, ఐఐటీ అకడమిక్ ఇన్​చార్జి అశోక్, సందీప్, టీచర్స్  పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా యువతి మృతి

ముదిగొండ, వెలుగు: అనుమానాస్పదంగా చెట్టుకు ఉరేసుకుని కుళ్లిపోయిన స్థితిలో ఉన్న యవతి మృతదేహం మండలకేంద్రంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముదిగొండలోని వైన్ షాప్​ వెనక నిర్మానుష్య ప్రాంతం నుంచి రెండు రోజులుగా దుర్వాసన రావడంతో సోమవారం సాయంత్రం చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకున్న యువతి మృతదేహం కనిపించింది. ఆమెను ఖమ్మం అర్బన్  మండలం కొత్తగూడెంకు చెందిన కొండపల్లి రూతమ్మ(18)గా గుర్తించారు. ఆమె బంధువులతో కలిసి భిక్షాటన చేస్తుందని, మతిస్థిమితం కూడా సరిగా ఉండదని బంధువులు తెలిపారు. రూతమ్మ ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురైందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తోట నాగరాజు తెలిపారు.

భార్య వదిలేసి వెళ్లిందని భర్త సూసైడ్

తల్లాడ, వెలుగు: భార్య వదిలేసి వెళ్లిందని భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని నూతనకల్ గ్రామానికి చెందిన ఏలూరి మురళీరెడ్డి(38) లారీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్యం పాలవడంతో భార్య వదిలేసి వెళ్లింది. మనస్థాపానికి గురైన మురళీరెడ్డి సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరేసుకొని మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో అపశృతి

పాల్వంచ,వెలుగు: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దంపతులు వేదికపై ఉండగా, విషెస్​ చెప్పేందుకు అభిమానులు ఎక్కువ సంఖ్యలో స్టేజి ఎక్కడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఎమ్మెల్యే క్షేమంగా బయటపడగా, పలువురు కార్యకర్తలకు స్వల్పగాయాలయ్యాయి. కార్యకర్తలు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. కొత్తగూడెం మున్సిపల్​ చైర్ పర్సన్ సీతామహాలక్ష్మి, డీఎస్పీ వెంకటేశ్వర బాబు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ విషెస్​ చెప్పిన వారిలో ఉన్నారు.

‘పోడు పట్టాలిప్పించిన ఘనత మాదే’

గుండాల, వెలుగు: పోడు  భూములకు పట్టాలిప్పించిన ఘనత సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీదేనని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు తెలిపారు. మంగళవారం మండలకేంద్రంలో ఈసం శంకర్ అధ్యక్షతన అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం రైతుల పక్షాన పోరాడి ప్రాణాలర్పించిన అమరవీరులను మరిచిపోవద్దని అన్నారు. పోడు భూములకు పట్టాలిచ్చేంత వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, జిల్లా కార్యదర్శి కెచ్చల రంగారెడ్డి, పాయం చిన్న చంద్రన్న, చండ్ర అరుణ, రాయల చంద్రశేఖర్, జగ్గన్న, మాచర్ల సత్యం, అజయ్​ పాల్గొన్నారు.

ఖమ్మం టౌన్: అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాటాలు చేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సిటీలోని రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. పీవోడబ్ల్యూయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్  శిరోమణి, ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య పాల్గొన్నారు.

గవర్నమెంట్​ హాస్పిటల్స్​లో డెలివరీల సంఖ్య పెరగాలి

అన్నపురెడ్డిపల్లి,వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్ లో డెలివరీల సంఖ్య పెరిగేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్​వో దయానందస్వామి ఆదేశించారు. మంగళవారం ఎర్రగుంట పీహెచ్ సీని విజిట్ చేశారు. రికార్డులు, మందుల స్టాకును పరిశీలించారు. ఏఎన్ఎంలు ,ఆశావర్కర్లతో సమావేశం నిర్వహించి గ్రామల్లో మెరుగైన సేవలు అందించాలన్నారు. అనంతరం పీహెచ్ సీలో బాలింతలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ ప్రియాంక, సిబ్బంది ఉన్నారు.

వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు పెంచాలి

చండ్రుగొండ, వెలుగు: పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. అయ్యన్నపాలెం గ్రామంలో మంగళవారం సంఘం 6వ మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు వంటి కనీస వసతులు కల్పించాలన్నారు. పత్తికి క్వింటాలుకు రూ.10 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.  అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీను, కార్యదర్శి గా వేణు, ఉపాధ్యక్షుడిగా గోపాల్, సహాయ కార్యదర్శి గా సరస్వతి ఎన్నికయ్యారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, లీడర్లు నరేశ్, రామిరెడ్డి, వెంకటాచారి, మోహన్ రావు, నాగూల్ మీరా, సీత పాల్గొన్నారు.