అడ్మిషన్లు తెస్తేనే సాలరీస్​.. పేరెంట్స్​ దగ్గర వసూలు చేసేది ఏడాది ఫీజు

అడ్మిషన్లు తెస్తేనే సాలరీస్​..  పేరెంట్స్​ దగ్గర వసూలు చేసేది ఏడాది ఫీజు
  • అడ్మిషన్లు తెస్తేనే సాలరీస్​
  • పేరెంట్స్​ దగ్గర వసూలు చేసేది ఏడాది ఫీజు
  • సిబ్బందికి ఇచ్చేది 10నెలల జీతమే
  •  శ్రమ దోపిడీ చేస్తున్నారని ప్రైవేట్​ టీచర్ల ఆవేదన
  • జీవో నంబర్​ 1ను  అమలు చేయాలని డిమాండ్​

పెద్దపల్లి, వెలుగు:   పేరెంట్స్​ నుంచి వేలల్లో  ఫీజులు వసూలు చేస్తున్న  ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల మేనేజ్​మెంట్లు తమ దగ్గర పనిచేసే టీచర్లు, లెక్చరర్లు, ఇతర సిబ్బందిని శ్రమదోపిడీ చేస్తున్నారు.  స్టూడెంట్ల నుంచి ఏడాది కాలానికి  ఫీజులు చేస్తూ  తమ సిబ్బందికి పది లేదా పదకొండు నెలల సాలరీ మాత్రమే ఇస్తున్నారు.   తాము చెప్పిన టార్గెట్ ప్రకారం అడ్మిషన్లు తెచ్చిన  వారికి సమ్మర్​ సాలరీ ఇస్తున్నారు.  టార్గెట్​ పూర్తి చేయని వారికి సమ్మర్​ సాలరీ కాదు కదా  ఉద్యోగానికి కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎవరైనా మేనేజ్​మెంట్​ను ప్రశ్నిస్తే  ఇక అంతే  ఉద్యోగం ఊస్ట్​ చేస్తున్నారు.  ఒకప్పుడు ఇలాంటి వ్యవస్థ కార్పొరేట్​ సంస్థల్లోనే ఉండేది.. కరోనా తర్వాత అన్ని విద్యాసంస్థల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 12,770 ప్రైవేట్​ స్కూళ్లు ఉన్నాయి.  అందులో 2.96 లక్షల మంది టీచర్లు  పనిచేస్తున్నారు.  నాన్​ టీచింగ్​ తో  కలిపి 3.20 లక్షల సిబ్బంది ఉన్నారు.  సమస్యలను విద్యా శాఖ ఆఫీసర్ల దృష్టికి తీసుకపోయినా పట్టించుకోవడం లేదు. ఏ సమస్య ఉన్నా  మేనేజ్​మెంట్​తో మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని ప్రైవేట్​టీచర్లు వాపోతున్నారు. ప్రభుత్వం  డీఎస్సీ, గురుకుల నోటిఫికేషన్లు క్యాలెండర్​ ప్రకారం వేస్తే తమకు ప్రైవేట్​ బాధలు తప్పేవని అంటున్నారు. ప్రభుత్వ ఉపాధి లేకపోవడంతో దిక్కులేక ప్రైవేట్​ మేనేజ్​మెంట్ల  కింద వెట్టిచాకిరి చేయాల్సి వస్తోందని ప్రైవేట్​ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శ్రమ దోపిడీ..

సాలరీ పరిస్థితి ఇలావుంటే సెలవులది అంతకంటే దారుణంగా ఉంది.  ప్రభుత్వం నిర్ణయించిన సెలవు దినాలు ప్రైవేట్​ విద్యాసంస్థల్లో  పనిచేసే వారికి వర్తింపజేయడంలేదు. సర్కార్​ హాలీడే క్యాలెండర్​ విడుదల చేసినా దాన్ని  ప్రైవేటు విద్యాసంస్థలు పట్టించుకోవడం లేదు.  మహనీయుల వర్ధంతి, జయంతి హాలీడేస్​ను కూడా లైట్​గా తీసుకొని సంస్థలు నడుపుతున్నారు.   కొందరు ఉద్యోగులైతే 365 రోజులు డ్యూటీలోనే ఉంటున్నారు.  సమ్మర్​ హాలీడేస్​ ఇచ్చినా  టీచింగ్​, నాన్​ టీచింగ్​ అందరికీ టార్గెట్లు పెట్టి  అడ్మిషన్ల కోసం ఊర్లల్లో  తిప్పుతున్నారు. ఇచ్చిన టార్గెట్​ రీచ్​ అయిన వారికే సమ్మర్​ సాలరీతో పాటు సంస్థలో కొనసాగే చాన్స్​ ఇస్తున్నారు. క్యాంపెయినింగ్​ చేసే స్టాఫ్​కు ఎలాంటి అలవెన్స్​ఇవ్వడం లేదు.  సొంత డబ్బులు పెట్టుకొని టార్గెట్ల కోసం తిరుగుతున్నారు.  ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు వేరే జీవనోపాధి ఉండదు.  దీంతో ఉద్యోగం కాపాడుకోవడానికి మేనేజ్​మెంట్​ పెట్టే  స్ట్రిక్ట్​ రూల్స్​కు తలూపాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జీవో నం.​1 బేఖాతర్​..

విద్యాశాఖలో సర్కార్​ తెచ్చిన జీవో  నంబర్​1 ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ  విద్యాసంస్థ ఫాలో కావడం లేదు. జీవో 1 ప్రకారం విద్యాసంస్థల్లోని ఆదాయం 50 శాతం సిబ్బంది జీతాలకు,  మరో 15 శాతం సిబ్బంది వెల్ఫేర్​కు  వాడాలి. అలాగే 30 శాతం విద్యా సంస్థ నిర్వహణకు ఉపయోగించాలి. 5 శాతం మాత్రమే మేనేజ్​మెంట్​ తమ సొంతానికి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయా విద్యా సంస్థలు ఇదంతా తప్పించుకోవడానికి రిజిస్ట్రేషన్​  టైంలో ఏదో ఒక ట్రస్టుకు అనుబంధంగా విద్యాసంస్థను రిజిస్టర్​ చేయించుకుంటున్నారు. దీంతో జీవో నంబర్​ 1  అమలు కావడం లేదు.  అలాగే  కార్పొరేట్​ విద్యాసంస్థలకు  రాజకీయ,  విద్యాశాఖ ఆఫీసర్లు సపోర్ట్​గా ఉంటున్నారని ప్రైవేట్​ టీచర్లు ఆరోపిస్తున్నారు.  పీఎఫ్​, ఈఎస్​ఐ, అలవెన్స్ లు లేకుండా పనిచేయాల్సి వస్తోందంటున్నారు.  గతంలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేదని,  ఇప్పటికైనా జీవో 1ను పక్కాగా అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.

సర్కార్​ దృష్టి పెట్టాలి..

ప్రైవేట్​ విద్యాసంస్థల్లో నియంతృత్వం పెరిగింది. అడ్మిషన్ల నుంచి రిజల్ట్స్​ వరకు టార్గెట్లు పెట్టి సిబ్బందిని టార్చర్​ చేస్తున్నారు. జాబ్​ సేఫ్టీ  లేకపోవడంతో కుటుంబాల కోసం ఓర్చుకొని పనిచేస్తున్నారు. సర్కార్​ ప్రైవేటు విద్యాసంస్థలపై దృష్టి సారించి ప్రైవేట్​ టీచర్లు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలి.

షేక్​ షబ్బీర్​ అలీ, టీపీటీఎఫ్​రాష్ట్ర అధ్యక్షుడు

జీవో నం. 1  అమలు చేయాలి

ప్రైవేటు విద్యాసంస్థల్లో  సిబ్బందికి, విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా సర్కార్​ జీవో నం. 1 ప్రవేశపెట్టింది. కానీ ఏ ప్రైవేట్​ విద్యాసంస్థ అమలు చేయడం లేదు. జీవో నం.1 అమలుకు ఆయా జిల్లాల విద్యాశాఖ ఆఫీసర్లు పక్కాగా చర్యలు తీసుకోవాలి. 
- ఆవుల రాజేశ్​,  టీపీటీఎఫ్​పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు