ఎంబీబీఎస్‌లో మరో 1,500 సీట్లు!

V6 Velugu Posted on Aug 03, 2021

  • 8 ప్రభుత్వ, 2 ప్రైవేటు కాలేజీల ఏర్పాటుతో అందుబాటులోకి
  • ప్రస్తుతం 34 కాలేజీల్లో 5,265 సీట్లు.. 6,765కి పెరిగే చాన్స్
  • ఎన్ఎంసీ పర్మిషన్ వస్తే.. వచ్చే ఏడాదే కొత్త కాలేజీల్లో అడ్మిషన్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్తగా 8 ప్రభుత్వ, 2 ప్రైవేటు కాలేజీల ఏర్పాటుతో 1,500 దాకా సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 34 కాలేజీల్లో 5,265 సీట్లు ఉండగా.. కొత్త కాలేజీల రాకతో వచ్చే ఏడాదికి 6,765 అయ్యే చాన్స్ ఉంది. ఇవి కాక ఇప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్ల సంఖ్య పెరిగితే 7 వేలకు చేరే అవకాశం ఉంది.

ఒక్కో కాలేజీలో 150
ప్రస్తుతం రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 23 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వం మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రకటించగా, సింగరేణి సంస్థ రామగుండంలో ఓ కాలేజీ ఏర్పాటు చేయనుంది. ఈ 8 కాలేజీల ఏర్పాటుకు అవసరమైన పనులను మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌మెంట్ ప్రారంభించింది. ఇవిగాక మరో 2 ప్రైవేట్ కాలేజీలు రానున్నాయి. వీటన్నింటికీ నేషనల్ మెడికల్ కమిషన్‌‌(ఎన్‌‌ఎంసీ) గుర్తింపు లభిస్తే, ఒక్కో కాలేజీలో 150 చొప్పున 15 వందల ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బీబీనగర్‌‌‌‌ ఎయిమ్స్‌‌లో ప్రస్తుతం 50 సీట్లు ఉండగా, అవి 150 దాకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు కాలేజీలు కూడా సీట్లు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఏడు వేల దాకా ఎంబీబీఎస్ సీట్లు స్టూడెంట్లకు అందుబాటులోకి రానున్నాయి.

కాంపిటీషన్ తగ్గుతున్నది
మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఎన్ఎంసీ గుర్తింపు కచ్చితంగా తీసుకోవాలి. అక్టోబర్ నాటికి అన్ని పనులూ పూర్తి చేసి 8 కాలేజీల గుర్తింపు కోసం ఎన్‌‌ఎంసీకి దరఖాస్తు చేస్తామని మెడికల్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ అప్లికేషన్లను పరిశీలించి ఎన్‌‌ఎంసీ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేస్తారు. కాలేజీ బిల్డింగ్, కాలేజీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్‌‌ను చూసి పర్మిషన్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఎన్‌‌ఎంసీ పర్మిషన్ ఇస్తే 2022–23 విద్యా సంవత్సరంలో కొత్త కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది పర్మిషన్ కోసం 2 ప్రైవేటు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెల చివరికల్లా ఆయా కాలేజీల పర్మిషన్‌‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కాలేజీలకు పర్మిషన్ వస్తే ఈ విద్యా సంవత్సరం సీట్ల సంఖ్య 5,565కి చేరుతుంది. సీట్ల సంఖ్య పెరుగుతుండడంతో సీట్ల కోసం కాంపిటీషన్ కూడా తగ్గుతోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఒక్కో సీటుకు ఏడుగురు పోటీ పడితే.. 2020–21లో ఒక్కో సీటుకు ఐదుగురు మాత్రమే పోటీ పడ్డారు.

రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం.. నిధులు రాలే
దేశంలో వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పైసలు ఇవ్వాలని నిర్ణయించి, 2017లో ఓ స్కీమ్‌‌ను ప్రారంభించింది. కాలేజీల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. 2017 నుంచి 2019 దాకా మూడు దశల్లో 157 కాలేజీల ఏర్పాటుకు ఈ స్కీమ్ కింద రూ.16,735.21 కోట్లు కేటాయించింది. ఒక్క తెలంగాణ తప్ప, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ స్కీమ్ కింద కొత్త మెడికల్ కాలేజీలు వచ్చాయి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌‌ ఏడు కాలేజీల కోసం అప్లై చేస్తే, 3 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చి నిధులు కేటాయించారు. మన రాష్ట్రానికి కనీసం 2 నుంచి 3 కాలేజీలు వచ్చే అవకాశం ఉన్నా.. సర్కార్ నిర్లక్ష్యం చేసింది. కనీసం ఒక్క కాలేజీ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. 2019లో మూడో దశ అప్లికేషన్లు తీసుకునే సమయంలో.. కాలేజీల కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల తెలంగాణ నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది. హైదరాబాద్‌‌కు వచ్చిన కేంద్ర అధికారులు, కాలేజీల కోసం దరఖాస్తు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు. దీంతో హడావుడిగా డీపీఆర్‌‌‌‌లు సిద్ధం చేసిన ఆఫీసర్లు, చివరి దాకా కేంద్రానికి అప్లికేషన్లు పంపించలేదు. దీంతో మన రాష్ట్రానికి కనీసం ఒక్క కాలేజీ కూడా రాలేదు.

Tagged Telangana, study, mbbs, medical colleges, Medical Students, Medical seats, MBBS seats

Latest Videos

Subscribe Now

More News