
సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్ .. ఇతర అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని మంత్రులు, ఎంఎల్యేలు, అధికారులు దర్శించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్.. కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు.
బోనాల వేడుకకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ ఆవరణంలో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెళ్లు, ఫలహార బండ్ల ఊరేగింపు కోలాహలంగా ఉంది.
లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి భక్తులు శోభాయమానంగా బోనాలు సమర్పించారు. ఆదివారం ( జులై 13) భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, కోలాట బృందాలు, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో అమ్మవారి ఆలయ ప్రాంగణం శోభాయమానంగా మారింది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. బోనాల వేడుకలు ఘటోత్సవంతో మొదలయ్యాయి.