దేశ చరిత్రలో మరో అధ్యాయం.. కొత్త బిల్డింగ్​లో సమావేశాలు మొదలు

దేశ చరిత్రలో మరో అధ్యాయం.. కొత్త బిల్డింగ్​లో సమావేశాలు మొదలు

న్యూఢిల్లీ: మన దేశ చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. పార్లమెంట్ కొత్త బిల్డింగులో మంగళవారం నుంచి సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాత బిల్డింగ్ లోని సెంట్రల్ హాల్ లో ఫేర్ వెల్ మీటింగ్ ముగిసిన తర్వాత.. ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ కొత్త బిల్డింగులోకి నడిచి వెళ్లారు. కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు ఆయన వెంట ఉన్నారు. లోక్ సభ ప్రొసీడింగ్స్ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓంబిర్లా మాట్లాడారు.

Also Read : ప్రేమ కోసం సప్త సాగరాలు దాటి

ఇదో చరిత్రాత్మక సందర్భమని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలను లేవనెత్తి, పార్లమెంటరీ డిబేట్ లో కొత్త ప్రమాణాలు నెలకొల్పాలని సభ్యులకు సూచించారు. దేశాభివృద్ధి కోసం కృషి చేసిన నేతలకు నివాళులు అర్పించారు. కాగా, కొత్త బిల్డింగ్ కు ‘పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా’గా పేరు పెట్టారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  

ఆరు ద్వారాలు...  

కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ను మే 28న ప్రధాని మోదీ ప్రారంభించారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కొత్త బిల్డింగ్ ను నిర్మించారు. ఇందులో మొత్తం నాలుగు అంతస్తులు ఉన్నాయి. 888 మంది సభ్యులు కూర్చునేలా లోక్ సభ, 384 మంది కూర్చునేలా రాజ్యసభ ఏర్పాటు చేశారు. లోక్ సభ చాంబర్ ను జాతీయ పక్షి నెమలి థీమ్ తో, రాజ్యసభ చాంబర్ ను జాతీయ పుష్పం కమలం థీమ్ తో తీర్చిదిద్దారు. మంత్రుల ఆఫీసుల కోసం 92 రూమ్స్ కట్టారు. బిల్డింగ్​కు 6 ద్వారాలు (ఎంట్రీ అండ్ ఎగ్జిట్) ఉన్నాయి. వాటికి గజ ద్వార్, అశ్వ ద్వార్, శార్దులా, హంస, మకర, గరుడ ద్వార్​అని పేరు పెట్టారు. ఆయా ద్వారాల వద్ద వాటిని ప్రతిబింబించేలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. కాగా, కొత్త బిల్డింగ్​లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎంపీలకు ప్రభుత్వం కానుక అందజేసింది. జనపనారతో చేసిన బ్యాగులో పార్లమెంట్​ పాత, కొత్త భవనాలను ముద్రించిన స్టాంపులు, స్మారక నాణెం అందజేసింది.