గడ్డిఅన్నారం కార్పొరేటర్ పై మరో కిడ్నాప్ కేసు

గడ్డిఅన్నారం కార్పొరేటర్ పై మరో కిడ్నాప్ కేసు

హైదరాబాద్ : గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డిపై మరో కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం రెండు కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. గత నెల 28వ తేదీన జయశంకర్ అనే వ్యక్తి ని కార్పొరేటర్ కార్యాలయంలో నిర్బంధించి బెదిరింపులకు గురి చేసినట్లు కేసు నమోదైంది. కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డితో పాటు పునీత్, తివారీ, రవి వర్మ, హేమంత్, కోటేశ్వర రావు అనే వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశారు. 

ఇటు సరూర్ నగర్ పీఎన్ టీ కాలనీలో లంకా లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. గత నెల 30వ తేదీ మంగళవారం రాత్రి లక్ష్మీ నారాయణ కుమారుడు సుబ్రహ్మణ్యం(24) కిడ్నాప్ కు గురయ్యాడు. బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ఉదంతాన్ని చేధించారు. సుబ్రహ్మణ్యంను కిడ్నాప్ చేసిన 9 మందిని నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం కిడ్నాప్ కేసులో గడ్డిఅన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డికి ఇప్పటికే రిమాండ్ విధించారు. ప్రేమ్‌ మహేశ్వర్ రెడ్డితో పాటు మరో 9 మందికి  న్యాయస్థానం14 రోజుల రిమాండ్ విధించింది. మొత్తం 10 మంది నిందితులను సరూర్ నగర్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.