ఏపీ, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు

ఏపీ, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు

ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు మరో ప్రకృతి విపత్తు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్ర తుపాన్ గా మారింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వాయువ్యంగా పయనిస్తున్న అసని తుపాన్.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ప్రస్తుతం అది విశాఖపట్నానికి ఆగ్నేయంగా 810 కిలోమీటర్లు, పూరికి దక్షిణ ఆగ్నేయంగా 880 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు సాయంత్రం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్న అసని తుఫాన్.. ఈ నెల 12 నాటికి వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

తీవ్ర తుపాన్ ప్రభావంతో బంగాళాఖాతంలో అలల తీవ్రత పెరిగింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. రాయలసీమలోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బాపట్ల జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని మచిలీపట్నం, కృష్ణపట్నం, విశాఖపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల 12వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

తెలంగాణలోనూ రాబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అసని తుఫాన్ ప్రభావం తెలంగాణపై తక్కువగానే ఉంటుందని వాతావారణశాఖ అధికారులు అంటున్నారు. ఏపీ, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం చెబుతున్నారు. తుపాన్ తీరానికి దగ్గరయ్యేకొద్దీ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ ధర్నా