తిరుపతి ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో మరో పిటిషన్

తిరుపతి ఆస్పత్రి ఘటనపై హైకోర్టులో మరో పిటిషన్
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తిరుపతి ఎస్పీకి నోటీసులు జారీ

అమరావతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో జాప్యంతో రోగులు చనిపోయిన ఘటనపై  హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తెలుగుదేశం పార్టీ నేత పీఆర్ మోహన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈయన తరపున  న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపిస్తూ ఆసుపత్రిలో నిర్లక్ష్య ఘటనపై ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. స్వయంగా జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ ఆక్సిజన్ సమయానికి అందలేదని చెప్పారని... ఇది నిర్లక్ష్యమేనని, తీవ్ర శిక్షార్హమైన ఘోర తప్పిదమని న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు.ఈ ఘటనలో 36 మంది చనిపోతే ప్రభుత్వం 11 మందేనని చెబుతోందని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు ప్లాంట్లను రాష్ట్రంలో నేటి వరకు నెలకొల్పలేదని కోర్టుకు తెలిపారు. ఫిర్యాది తరపున వాదనలు విన్న హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు తిరుపతి జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత వేసవి సెలవుల అనంతరం కోర్టు ప్రారంభమైన తొలిరోజుకి విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది.