ఎమ్మెల్యేల కేసు: రామచంద్రభారతి, నట్టికుమార్ విడుదల.. అంతలోనే అరెస్ట్

ఎమ్మెల్యేల కేసు: రామచంద్రభారతి, నట్టికుమార్ విడుదల.. అంతలోనే అరెస్ట్

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితులైన రామచంద్రభారతి, నందకుమార్‌ గురువారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోర్జరీ ఆధార్‌‌, పాస్‌పోర్ట్‌ మార్ఫింగ్‌ కేసుల్లో రామచంద్రభారతిని, డెక్కన్ కిచెన్ లీజ్‌ తోపాటు మరో ఐదు కేసుల్లో నందకుమార్‌‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బంజారాహిల్స్ పీఎస్​కు తరలించి విచారించారు. స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేసిన అనంతరం మెడికల్​ టెస్టులు నిర్వహించి, నాంపల్లిలోని 3వ అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరు పరిచారు. నిందితుల తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కోర్టు రామచంద్రభారతికి బెయిల్‌ మంజూరు చేసింది. రెండు ష్యూరిటీలతో, రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. నందకుమార్‌‌కు14 రోజల జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది. రామచంద్రభారతి ష్యూరిటీస్ సమర్పించకపోవడంతో ఆయనతోపాటు నందకుమార్​ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. పూచీకత్తు డిపాజిట్‌ చేసిన అనంతరం శుక్రవారం రామచంద్రభారతి విడుదల కానున్నారు.    

జైలు నుంచి  బయటకు రాగానే అరెస్ట్ 

రామచంద్రభారతి, నందకుమార్‌‌, సింహయాజీకి ఇటీవల హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సింహయాజి బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. రామచంద్రభారతి, నందకుమార్‌  గురువారం రిలీజ్‌అయ్యారు. అయితే.. అప్పటికే  జైలు బయట నిఘా పెట్టిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. రామంచద్రభారతి, నందకుమార్‌‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు పక్కా ప్లాన్‌తో వ్యవహరించారు. ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, సిట్ ఏసీపీ గంగాధర్‌‌  ఫిర్యాదులతో రామచంద్రభారతిపై ఇప్పటికే రెండు కేసులు రిజిస్టర్ చేశారు. ఫోర్జరీ ఆధార్‌ ‌కార్డులు, పాన్‌ కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రెండు ఫ్యాబ్రికేటెడ్‌ పాస్ట్‌పోర్ట్‌లు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. నందకుమార్‌‌పై బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు దగ్గుబాటి రానా, సురేష్‌కు చెందిన ల్యాండ్ లీజ్‌ కేసులో పాటు డెక్కన్ కిచెన్‌ ‌లీజ్‌ పేరుతో మరో ఆరుగురిని మోసం చేశారనే ఫిర్యాదులతో పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారు. ఇందులో సయ్యద్‌ అజీజ్‌ను రూ.70లక్షలు మోసం చేశారనే కేసులో  నందకుమార్‌‌ను ప్రిజన్‌ట్రాన్సిట్‌( పీటీ) వారెంట్‌పై కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. బొంబాయి గార్మెంట్స్‌ నిర్వాహకురాలు ఇందిరను మోసం చేసిన కేసులో మినహా మిగితా కేసుల్లో  పీటీ వారెంట్‌దాఖలు చేయలేదు. నందకుమార్‌‌పై రాజేంద్రనగర్ పీఎస్‌లో కేసులు నమోదైనట్లు గుర్తించారు. వరుస కేసుల కారణంగా పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.