చున్నీలు, చేతులు, కాళ్లపై ఆన్సర్లు

చున్నీలు, చేతులు, కాళ్లపై ఆన్సర్లు

ఏపీలో ఎంతో సీరియస్ గా జరుగుతున్న డిగ్రీ ఎగ్జామ్స్ లో స్టూడెంట్స్ చిత్ర, విచిత్ర ఐడియాలతో వస్తున్నారు. పరీక్షల్లో కాపీ కొట్టేందుకు కొత్త ఐడియాలతో.. ఆన్సర్లు రాసుకుని వస్తున్నారు. అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మార్చి 15వ తేదీ జరిగిన పరీక్షలో కాపీ చేస్తూ కొందరు స్టూడెంట్స్ పట్టుబడ్డారు. వీరిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. కాకపోతే వాళ్లు కాపీ కోసం ఎంచుకున్న విధానమే చిత్ర, విచిత్రంగా ఉండటంతో మ్యాటర్ వైరల్ అవుతుంది.

అబ్బాయిలు చాలా మంది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ లతో వచ్చారు. బటన్స్ విప్పి చూస్తే చేతుల మీద ఆన్సర్ రాతలు ఉన్నాయి. ప్యాంట్స్ పైకి ఎత్తితే కాళ్లపైనా ఆన్సర్లను పెన్నులతో రాసి ఉన్నాయి. ఇక పొట్టపైనా మరికొంత మంది స్టూడెంట్స్ రాసుకొచ్చారు. 

అమ్మాయిల విషయానికి చున్నీలపై ఆన్సర్లను రాసుకొచ్చారు. మరికొందరు అమ్మాయిలు అయితే చిట్టీలను జడ కొప్పుల్లో పెట్టుకుని వచ్చారంట. కొత్త కొత్త ఐడియాలతో కాపీ చేస్తూ వీళ్లందరూ దొరికిపోవటంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. 

డిగ్రీ ఫస్టియర్.. మూడో సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుండగా.. అనంతపురంలోని ఎస్వీ డిగ్రీ కాలేజీ, ఎస్ఎల్ఎన్ డిగ్రీ కళాశాల డిగ్రీ కాలేజీలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు అధికారులు. ఎగ్జామ్ హాలులో టెన్షన్ పడటం.. హడావిడి పడటం.. అనుమానాస్పదంగా ప్రవర్తన ఉండటంతో.. ఇన్విజిలేటర్లు తనిఖీ చేయగా ఈ బండారం బయటపడింది. ఈ క్రమంలోనే స్టూడెంట్స్ అందర్నీ తనిఖీ చేయగా.. ఆరుగురు స్టూడెంట్స్ పట్టుబడ్డారు. వీళ్లందరినీ డిబార్ చేశారు అధికారులు. 

శరీరంపైనా.. చున్నీలపైనా ఆన్సర్లు రాసుకుని వచ్చారని తెలిపారు అధికారులు. కాపీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. కచ్చితంగా డీబార్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.