నాన్​వెజ్​లో యాంటీ బయాటిక్స్

నాన్​వెజ్​లో యాంటీ బయాటిక్స్
  •    కోళ్లు, చేపలు, మేకలు, గొర్లు, రొయ్యల్లో పెరిగిపోతున్న మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్  
  •     ఐకార్-ఎఫ్ఏవో స్టడీలో ఆందోళనకర విషయాలు
  •     యాంటీ బయాటిక్​ను బట్టి 40 నుంచి 90% వరకు నిరోధకత
  •     అత్యధికంగా పెన్సిలిన్స్​కు 70–90 శాతం రెసిస్టెన్స్  
  •     జంతువుల్లో యాంటీ బయాటిక్స్​వాడకంపై నిఘా పెట్టాలని రిపోర్టులో సూచన

హైదరాబాద్, వెలుగు:  ఒకప్పుడు సండే వస్తేనో లేదంటే పండుగో పబ్బమో ఉంటేనో ఇంట్లో నీసు కౌసు ఉండేది. కానీ ఇప్పుడు నాన్​వెజ్​ రెగ్యులర్​ ఫుడ్​ ఐటెం అయిపోయింది. అయితే ఆ నాన్​వెజ్​లో యాంటీ బయాటిక్స్​ స్థాయిలు ఎక్కువైపోతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కోళ్లు, మేకలు, గొర్లు, చేపలు, రొయ్యలన్నా తేడా లేకుండా అన్నింటి పెంపకంలోనూ యాంటీ బయాటిక్స్​ వాడకం పెరిగిపోతున్నది. దీంతో వాటిల్లో మల్టీ డ్రగ్​రెసిస్టెన్స్ (నిరోధకత) ఎక్కువైపోతున్నది. ఏదైనా జబ్బు చేస్తే ప్రజలు వాడే యాంటీ బయాటిక్​లకు ఆ జీవాలూ రెసిస్టెన్స్​ను పెంచుకుంటున్నాయి. ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​ అగ్రికల్చర్​ రీసెర్చ్​(ఐకార్), ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్​ అండ్​ అగ్రికల్చరల్​ ఆర్గనైజేషన్​(ఎఫ్ఏవో) కలిసి చేసిన స్టడీలో ఈ ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

దేశంలో తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల నుంచి 2019–2022 మధ్య కాలంలో శాంపిళ్లను సేకరించిన సంస్థలు.. ఈ–కొలి, స్టఫైలోకోకస్, ఏరోమోనస్​, విబ్రియో వంటి వివిధ రకాల బ్యాక్టీరియా ఆనవాళ్లపై పరిశోధనలు జరిపాయి. కోళ్లు, ఆవులు, బర్లు, గొర్లు, మేకలు, చేపలు, రొయ్యలు, పందుల నుంచి శాంపిళ్లను సేకరించి యాంటీ బయాటిక్స్​ రెసిస్టెన్స్​ను టెస్ట్​చేశాయి. వీటిలో బర్లు, ఆవులు తప్ప మిగతావన్నీ మల్టీ డ్రగ్​ రెసిస్టెన్స్​ను సంతరించుకుంటున్నాయని.. వాటిల్లో యాంటీ బయాటిక్స్​అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయని స్టడీ తేల్చింది. ముఖ్యంగా మనం వాడే పెన్సిలిన్స్​కు అధికంగా 70 నుంచి 90 శాతం వరకు ఇప్పటికే వాటికి రెసిస్టెన్స్​వచ్చిందని.. ఎరిత్రోమైసిన్​, సెఫొటాక్సిమ్, మెరోపినమ్, సిప్రొఫ్లోక్సాసిన్, సెఫొక్సిటిన్, సెఫ్పొడాక్సిమ్, అమికాసిన్​వంటి వాటికి ఎక్కువ మొత్తంలో నిరోధకతను సంతరించుకుంటున్నాయని తెలిపింది.  

కోళ్లలోనే ఎక్కువ..

ఎక్కువగా కోళ్లలోనే యాంటీ బయాటిక్స్​రెసిస్టెన్స్​పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. కోళ్లలో యాంపిసిల్లిన్​రెసిస్టెన్స్ 53 శాతం, సెఫోటాక్సిమ్​ రెసిస్టెన్స్​51 శాతం, టెట్రాసైక్లిన్​ రెసిస్టెన్స్​50 శాతం, నాలిడిక్సిక్​యాసిడ్ రెసిస్టెన్స్​ 47 శాతం వరకు ఉన్నట్టు వెల్లడించింది. అమోక్సోక్లావ్, ఎన్రోఫ్లోక్సాసిన్, అమికాసిన్, ఇమిపీనమ్​ వంటి యాంటీ బయాటిక్స్​కు 40 శాతం వరకు రెసిస్టెన్స్​ఉన్నట్టు పేర్కొంది. కోళ్ల పెంపకంలో యాంటీ బయాటిక్స్​వాడకం ఎక్కువగా ఉండడం వల్లే, వాటిలో యాంటీ బయాటిక్స్​కు నిరోధకత పెరుగుతున్నట్టు హెచ్చరించింది. ప్రతి యాంటీ బయాటిక్​కు కోళ్లలో ఎంతో కొంత రెసిస్టెన్స్​ఉన్నట్టు స్టడీ స్పష్టం చేసింది. మల్టీ డ్రగ్​రెసిస్టెన్స్​కోళ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నట్టు వెల్లడించింది. మేకల్లో సెఫొటాక్సిమ్​రెసిస్టెన్స్​ 41 శాతం ఉండగా అమికాసిన్​కు 35 శాతం, యాంపిసిల్లిన్​కు 26 శాతం దాకా నిరోధకత పెరుగుతున్నట్టు స్టడీ తేల్చింది. అదే గొర్లలో కొంచెం తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. వాటిల్లో 37 శాతం వరకు రెసిస్టెన్స్​ ఉంటున్నట్టు వెల్లడించింది. యాంటీ బయాటిక్స్​వాడకం గొర్లు, మేకల్లోనూ క్రమక్రమంగా పెరుగుతున్నదని హెచ్చరించింది. 

ఆవులు, బర్లలో తక్కువ..

ఆవులు, బర్లలో యాంటీ బయాటిక్​రెసిస్టెన్స్​తక్కువగా ఉన్నట్టు స్టడీలో తేలింది. ఆవులు, బర్లు ఇచ్చే పాలపైనా యాంటీ బయాటిక్స్​టెస్ట్​ చేశారు. వాటిలో రెసిస్టెన్స్​5శాతం లోపే ఉందని వెల్లడైంది. బర్లు, ఆవుల పెంపకంలో యాంటీ బయాటిక్స్​వాడకం తక్కువగా ఉండడం వల్లే రెసిస్టెన్స్​తక్కువగా ఉన్నట్టు రిపోర్ట్​తేల్చింది. అయితే పెన్సిలిన్, ఎరిత్రోమైసిన్​వంటి వాటికి మాత్రం 19 శాతం వరకు రెసిస్టెన్స్​ఉంటున్నట్టు స్టడీలో తేలింది. 62 శాతం శాంపిళ్లలో పెన్సిలిన్​కు రెసిస్టెన్స్​ ఉన్నట్టు తేలింది. అయితే ఈ–కొలికి సెఫొటాక్సిమ్​రెసిస్టెన్స్​బర్ల పాలలో 29 శాతం, ఆవు పాలలో 28 శాతం వరకు ఉన్నట్టు తేలింది. 

చేపల్లోనూ ఎక్కువే..

చెరువుల్లో పెంచే చేపల్లోనూ యాంటీ బయాటిక్​రెసిస్టెన్స్​పెరుగుతున్నట్టు రిపోర్ట్​హెచ్చరించింది. వాటిల్లో పెన్సిలిన్స్​కు 91 శాతం మేర రెసిస్టెన్స్​ఉన్నట్టు తెలిపింది. సిప్రోఫ్లోక్సాసిన్​కు(54 శాతం), ఎరిత్రోమైసిన్​కు (34 శాతం) వరకు రెసిస్టెన్స్​ఉందని చెప్పింది. రొయ్యల్లో పెన్సిలిన్స్​కు 94 శాతం రెసిస్టెన్స్​వచ్చినట్టు వెల్లడించింది. వివిధ రకాల బ్యాక్టీరియాలకు తగ్గట్టు ఈ రెసిస్టెన్స్ మారుతున్నదని, అన్ని బ్యాక్టీరియాలకూ చేపలు, రొయ్యల్లో 70 నుంచి 90 శాతం వరకు రెసిస్టెన్స్​ పెరుగుతున్నదని రిపోర్ట్​ స్పష్టం చేసింది. మల్టీ డ్రగ్​రెసిస్టెన్స్​ 39 శాతంగా ఉన్నట్టు వెల్లడైంది.

మరింత స్టడీ అవసరం..   

కోళ్లు, గొర్లు, బర్లు, మేకలు, చేపలు, ఆవుల్లో యాంటీ బయాటిక్స్​కు రెసిస్టెన్స్​పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని రిపోర్ట్ పేర్కొంది. వాటిల్లో రెసిస్టెన్స్​పెరుగుతున్నదంటే యాంటీ బయాటిక్స్​ వాడకం పెరుగుతున్నట్టేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై నిఘా పెట్టి, మరింత లోతుగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. చేపల పెంపకంలోనూ యాంటీ బయాటిక్స్ వాడకం ఆందోళనకరమని పేర్కొంది. యాంటీ బయాటిక్స్​వాడకం, వాటిలో రెసిస్టెన్స్​పై తప్పనిసరిగా సర్వైలెన్స్​ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పింది. మనుషులకు వాడే సెఫొటాక్సిమ్​ వంటి యాంటీ బయాటిక్స్​కు కూడా అవి నిరోధకతను సంతరించుకుంటున్నాయంటే.. వాటికి డైరెక్ట్​గా ఆ యాంటీబయాటిక్​ను వాడుతున్నారా? లేదా మనుషుల ద్వారా వెళ్తున్నదా? కలుషిత వాతావరణం ద్వారా వాటిలో అవశేషాలుంటున్నాయా అన్నది తేలాల్సిన అవసరం ఉందని తెలిపింది. మరోవైపు వాడుకలో లేని పెన్సిలిన్​వంటి యాంటీ బయాటిక్​లకు చేపలు, కోళ్లలో రెసిస్టెన్స్​పెరగడం ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. వీటిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.   

యాంటీ బయాటిక్స్​ వాడకం విచ్చలవిడిగా పెరుగుతున్నట్టే.. 

కోళ్లు, చేపలు, గొర్లకు యాంటీ బయాటిక్​ రెసిస్టెన్స్​ పెరగడం వల్ల భవిష్యత్​లో మనకు ఇన్​డైరెక్ట్​గా నష్టం జరిగే చాన్స్​ ఉంటుంది. యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్​ వస్తే వాటి జబ్బులు తగ్గే అవకాశం ఉండదు. ఇన్​ఫెక్షన్​ సోకిన వాటి మాంసాన్ని అలాగే మనకు ఇస్తే జూనోటిక్ ​డిసీజెస్ ​వచ్చే ప్రమాదం ఉంటుంది. మాంసం త్వరగా ఇచ్చేలా వాటి ఎదుగుదలకు యాంటీ బయాటిక్​లు వాడుతున్నట్టైతే డైరెక్ట్​గా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. యాంటీ బయాటిక్స్​కు అవి రెసిస్టెన్స్​ను పెంచుకుంటున్నాయం టే.. యాంటీ బయాటిక్స్ ​వాడకం పెరిగిపోతు న్నదనే అర్థం. పెన్సిలిన్స్​కు ఎక్కువ రెసిస్టెన్స్​ ఉందంటే ఆ కేటగిరీలోని హయ్యర్ ​యాంటీ బయాటిక్స్​కూ రెసిస్టెన్స్​ వచ్చే చాన్స్​ ఉంటుంది. 
- డాక్టర్ ​సోమశేఖర్,  గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, హైదరాబాద్