తన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే కేజ్రివాల్ కొత్త నాటకం : అనురాగ్ ఠాకూర్

తన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే  కేజ్రివాల్ కొత్త నాటకం : అనురాగ్ ఠాకూర్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ తన అవినీతి పై చర్చ జరగకుండా ఉండేందుకే కరెన్సీ నోట్లు అంశాన్ని లేవనెత్తారని  కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. తన అవినీతి బయటపడకుండా ఉండేందుకు.. కేజ్రివాల్  కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి, విఘ్నేశ్వరుడి రూపాలను ముద్రించాలంటూ కొత్త నాటకానికి తెర తీశారన్నారు. ఇది  కేజ్రీవాల్ అరాచకత్వానికి ప్రతీక అని అనురాగ్ అన్నారు . రామమందిరాన్ని వ్యతిరేకించేవారు, హిందూ దేవతలను అవమానించే వారు కూడా దీనిపై స్పందిస్తున్నారన్నారు.  

ఢిల్లీలోని ముస్లీం పెద్దలకు కేజ్రివాల్ ప్రభుత్వం ఏడాదికి 18వేల రూపాయిలు ఇస్తుందని... మరి గురుద్వార పూజారులకు, పాస్టర్లకు కూడా 18 వేలు ఇవ్వగలరా అని కేజ్రివాల్ ను అనురాగ్ ప్రశ్నించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చామని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ధరలు తగ్గాయన్నారు. ఇంకా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ధరలు అధికంగానే ఉన్నాయన్నారు. వ్యవసాయ రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని... కానీ పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ లలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ అనురాగ్ ప్రశ్నించారు. 

హిమాచల్ ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పై అనురాగ్ స్పందించారు. చాలా మంది పార్టీ టికెట్‌లు ఆశిస్తారు  కానీ అందరికి ఇవ్వలేమన్నారు. టికెట్లు దక్కని కొందరు సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకూ సిద్దమవుతున్నారని అలాంటి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.