'ఓపెన్‌హైమర్'లో ఆ సీన్ తీసేయండి : తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి

'ఓపెన్‌హైమర్'లో ఆ సీన్ తీసేయండి : తీవ్రంగా స్పందించిన కేంద్ర మంత్రి

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఓపెన్ హైమర్ ఇటీవలే విడుదల కాగా.. ఈ సినిమా ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సినిమాలోని భగవద్గీతను అవమానించేలా ఓ సన్నివేశం ఉందంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్న క్రమంలో... తాజాగా సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా స్పందించారు. దీనికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సినిమాలోని వివాదాస్పద సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని చిత్ర నిర్మాతలను ఆయన ఆదేశించారు. అంతేకాదు, సినిమా ప్రదర్శనను ఆమోదించిన సీబీఎఫ్‌సీ సభ్యులందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో CBFC వైఫల్యంపైనా అనురాగ్ ఠాకూర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని ఊరుకునేది లేదని ఉద్ఘాటించారు. బోర్డు సభ్యులే తమ చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రాబర్ట్ ఓపెన్‌హైమర్ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సక్సస్ ఫుల్ గా రన్ అవుతోంది. U/A సర్టిఫికేట్ పొందిని ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ, ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ JR నటించారు.