
- పంటలకు జీవం పోసిన వానలు
- అలుగు పోస్తున్న చెరువులు
- సాగుకు తప్పిన ఇబ్బందులు
మహబూబ్‌నగర్, వెలుగు: రైతులకు సాగునీటి కష్టాలు తప్పాయి. రెండు నెలల కిందటే వానాకాలం సీజన్ ప్రారంభమైనా.. సరైన వర్షాలు లేక వరి సాగు ముందుకు పడలేదు. అప్పటికే పత్తి, మక్క, జొన్న, కంది పంటలు సాగులోకి రాగా.. వర్షాలు లేక చేలు ఎదగని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలు జీవం పోశాయి. నోరెళ్లబెట్టిన చెరువులు ఫుల్ కెపాసిటీకి చేరి అలుగు పోస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పంటలతో పాటు వచ్చేడాది వరకు వ్యవసాయానికి సాగునీటి ఇబ్బంది తప్పినట్లైంది.
రెండేళ్ల తర్వాత..
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నా.. ఈ జిల్లాల్లో మాత్రం వర్షలు పడలేదు. దీంతో ఆగస్టు, సెప్టెంబరు వచ్చినా.. చెరువులు నిండలేదు. అయితే ఈశాన్య రుతుపవనాల వచ్చాక కొంత మేర వర్షం పడింది. అక్టోబరులో చెరువులు పూర్తి స్థాయిలో కాకపోయినా సగానికి పైగానే నిండాయి. కాని.. వాతావరణంలోని మార్పుల వల్ల చెరువుల్లో చేరిన కొంత మేర నీరు కూడా ఆవిరైపోయింది. జనవరి నుంచి ఎండలు కాయడంతో ఫిబ్రవరి చివరికల్లా వట్టిపోయాయి.
దీంతో యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం పడింది. పంటలకు సాగునీరు అందక ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ వానాకాలం సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో.. రోహిణి కార్తెలో వేసవి దుక్కులు చేసుకున్న రైతులు పత్తి, మక్క, జొన్న, కంది విత్తనాలను చల్లుకున్నారు. జూన్ మొదటి వారం నైరుతి రావడంతో మొదట్లో వర్షాలు పడ్డాయి. ఆ తర్వాత వానలు ముఖం చాటేశాయి.
జూన్, జులైలో ఎలాంటి వర్షాలు నమోదు కాలేదు. పత్తి సాగు చేసిన రైతులు పంటలను కాపాడుకోవడానికి డ్రిప్, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని పంటలను కాపాడుకున్నారు. వరి సాగు చేయాలనుకున్న రైతులు సాగునీరు అందుబాటులో లేక వర్షాల కోసం వేచి చూశారు. అయితే ఆగస్టు నెల ప్రారంభం నుంచి వర్షాలు ప్రారంభం అయ్యాయి. పది రోజుల కిందట కురిసిన వర్షం ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.
అల్పపీడనం ప్రభావంతో ఐదు రోజులుగా జిల్లాలో భారీ వర్షాల పడుతూనే ఉన్నాయి. వర్షాలకు అప్పర్ క్యాచ్మెంట్ నుంచి, కుంటల ద్వారా చెరువులకు భారీ మొత్తంలో వరద వస్తోంది. దీంతో చెరువులు ఫుల్ కెపాపిసిటీకి చేరుకొని అలుగు పారుతున్నాయి. ధన్వాడ, మరికల్, మక్తల్, మహబూబ్‌నగర్, హన్వాడ, అడ్డాకుల, కోస్గి, మద్దూరు ప్రాంతాల్లో చెరువులు పూర్తి స్థాయి మట్టానికి చేరుకున్నాయి. చిన్నచింతకుంట, కౌకుంట్ల, దేవరకద్ర మండలాల్లో ఇంత పూర్తి స్థాయిలో చెరువులు నిండాల్సి ఉంది. మరో రెండు భారీ వర్షాలు పడితే ఈ చెరువులు కూడా నిండే అవకాశం ఉంది.
సాధారణంకంటే అత్యధిక వర్షపాతం నమోదు
జూన్, జులైలో జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షం పడలేదు. దీంతో సాధారణంకంటే లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల మొదటి నుంచి వర్షాలు పడుతుండటంతో ఇప్పుడు లోటు వర్షపాతంకంటే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. జూన్ 1వ తేదీ నుంచి శనివారం వరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో 264.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 463.9 మిల్లీమీటర్లు, మహబూబ్‌నగర్‌లో నార్మల్ రెయిన్ ఫాల్ 310.7 మి.మీ.లకు గాను 538.8 మి.మీ., నారాయణపేటలో 292.7 మి.మీ.గాను.. 480.1 మి.మీ., వనపర్తిలో 292.5 మి.మీ.గాను 475.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు రాష్ర్టంలోని అన్ని జిల్లాలకంటే ఈ మూడు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైనట్లు తెలిసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం 255.1 మి.మీలకు గాను 338.6 మిల్లీమీటర్ల వర్షం కురసింది.
ఉధృతంగా పారుతున్న వాగులు
మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కుంటలు, వాగులు ఉధృతంగా పారుతున్నాయి. నాలుగు రోజుల కిందట అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి దుందుభీ, ఊకచెట్టువాగులు ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే కుంటల నీరు ఈ వాగుల్లోకి చేరడంతో ప్రమాదకర స్థాయిలో పారుతున్నాయి. దీంతో ఈ రెండు వాగుల ఆధారంగా నిర్మించిన చెక్ డ్యాముల వద్ద అలుగు పోస్తున్నాయి. దీనికితోడు సంగంబండ, కోయిల్‌సాగర్ రిజర్వాయర్లు ఎగువ నుంచి వరద వస్తుండడంతో నాలుగు రోజులుగా దిగువకు నీటిని వదులుతున్నారు.