
- ఓటర్ల లెక్కల ప్రకారం 8.73 లక్షల మంది గ్రూపుల్లో చేరలే
- కిశోర బాలికలు, వృద్ధులను చేర్పించేందుకు డీఆర్డీఏ కసరత్తు
- వికలాంగుల కేటగిరీలో పురుషులకూ చాన్స్
- ఉమ్మడి జిల్లాలో 61,527 సంఘాలు
యాదాద్రి, వెలుగు: కొత్తగా మరిన్ని మహిళా సంఘాలు ఏర్పాటు కానున్నాయి. గతానికి భిన్నంగా ఈసారి కిశోర బాలికలు, 60 ఏండ్లు దాటిన వృద్ధులను గ్రూపుల్లో చేర్పించనున్నారు. వికలాంగులకు సైతం సంఘాలు ఏర్పాటు చేసి, ఈ కేటగిరీలో పురుషులకూ అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) ఆధ్వర్యంలో డీఆర్డీఏ కసరత్తు చేస్తోంది.
మహిళల ఆర్థిక బలోపేతానికి..
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఇందిర మహిళా శక్తి మిషన్లో భాగంగా ప్రతీ మహిళకు సంఘాల్లో భాగస్వామ్యం కల్పించడానికి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 15 ఏండ్ల వయసు ఉన్న బాలికలతోపాటు ఓటు హక్కు కలిగిన ప్రతీ మహిళను గ్రూపుల్లో చేర్పించడానికి డీఆర్డీఏ చర్యలు తీసుకోనుంది.
ఉమ్మడి జిల్లాలో 6,38,744 సభ్యులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 61,527 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 6,38,744 మంది సభ్యులున్నారు. వీరు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా లోన్లు తీసుకొని ఉపాధి పొందుతున్నారు. 60 ఏండ్లు నిండిన మహిళలను గతంలో సంఘాల నుంచి తొలగించారు. ప్రస్తుతం వారిని తిరిగి తీసుకొని ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు.
స్కూల్స్, కాలేజీల నుంచి డేటా సేకరణ
డీఆర్డీఏ కిశోర బాలికలు, 60 ఏండ్లు పైబడిన వృద్ధులు, 40 ఏండ్ల వయసు పైబడిన వికలాంగులను గుర్తించే పనిలో పడింది. 15 నుంచి 18 ఏండ్ల వయసున్న కిశోర బాలికల కోసం ఐసీడీఎస్ వద్ద ఉన్న కిశోర బాలికల జాబితాతోపాటు స్కూల్స్, కాలేజీల నుంచి డేటా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు సంఘాల్లోని లేని మహిళలను గుర్తించేందుకు ఓటరు జాబితాను పరిశీలిస్తున్నారు. వృద్ధులు, వికలాంగులను గుర్తించడానికి చేయూత పింఛన్ల లిస్టు చూస్తున్నారు. ఇప్పుడు టెన్త్, ఇంటర్చదువుతున్న బాలికలు, ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రాసిన వారు కలిపి 70 వేల మందికి పైనే ఉన్నారు. బడి బయట ఉన్న బాలికల సంఖ్య తేలాల్సి ఉంది.
ఓటుహక్కు కలిగినవారు 15,11,939 మంది
ఉమ్మడి జిల్లాలో 15,11,939 మంది మహిళలు ఓటుహక్కు కలిగి ఉన్నారు. మహిళా సంఘాల్లో మాత్రం 6,38,744 మంది మాత్రమే చేరారు. 60 ఏండ్లు పైబడిన వారితో కలిపి 8,73,195 మందిని గ్రూపుల్లో చేర్చాల్సి ఉంది.
20 వేలకు పైగా ఏర్పాటు చేసే చాన్స్
ఉమ్మడి జిల్లాలో కొత్తగా 20 వేలకు పైగా సంఘాలు ఏర్పాటు చేసే చాన్స్ ఉంది. ఈ నెలాఖరులోగా జాబితాలు సేకరించి, గ్రూపులు ఏర్పాటు చేయించాలన్న లక్ష్యంతో డీఆర్డీఏ ముందుకు సాగుతోంది. ఆ తర్వాత సభ్యులతో బ్యాంక్అకౌంట్లు తీయించనుంది.
వికలాంగులు 54 వేల మంది..
ఉమ్మడి జిల్లాలో పింఛన్ తీసుకుంటున్న వికలాంగులు 54,110 మంది ఉన్నారు. వివిధ కారణాలతో మరికొందరికి పెన్షన్రావడం లేదు. పింఛన్లిస్ట్ఆధారంగా మహిళలైతే సంఘాల్లో ఉన్నారా లేరా అని పరిశీలిస్తున్నారు. పురుషులైతే కొత్తగా సంఘాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జాబితాలు పరిశీలిస్తున్నం
కొత్తగా మహిళా సంఘాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నం. ఇందుకోసం స్కూల్స్, కాలేజీల్లోని స్టూడెంట్స్, ఓటరు, పింఛన్ జాబితాలను పరిశీలిస్తున్నం. వివరాలను నోట్చేసుకుంటున్నం. – నాగిరెడ్డి , డీఆర్డీవో, యాదాద్రి