
- నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్
- స్థలాన్ని పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు: ట్యాంక్ బండ్‌పై బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు ఆఫీస్ ఎదురుగా నిర్మించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 10.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొంటారు. సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం వివిధ అంశాలపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, టీ ఫైబర్ ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో రివ్యూ చేస్తారు. రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకాల పనితీరు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తారు.
సర్వాయి పాపన్నకు మంత్రి పొన్నం నివాళి
సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు ప్రాంతాన్ని అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం పరిశీలించారు. బహుజనులు, దళిత, బడుగు, మైనార్టీ వర్గాలు ఏకమై పోరాడితే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. సర్వాయి పాపన్నను నేటి సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. పాపన్న గౌడ్ 375 వ జయంతి సందర్భంగా మంత్రి ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన పోరాట వీరుడు సర్వాయి పాపన్న అని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సర్వాయిపేటలో పాపన్న నిర్మించిన కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి 4.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తెలిపారు. ట్యాంక్ బండ్ వద్ద సర్దార్ పాపన్న విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు.